కాంగ్రెస్ పథకాలే మహిళలకు శ్రీరామ రక్ష…
Uncategorizedప్రభుత్వాన్ని విమర్శించడం అంటే మనల్ని మనం అవమానించు కోవడమే…
పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రాష్ట్రంలోని మహిళలకు, పేద ప్రజలకు శ్రీరామ రక్ష అని పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన పినపాక మండలంలో పర్యటనలో భాగంగా ఈ బయ్యారం, మల్లారం గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం గ్రామస్తుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి ఒక్కరినీ పలకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకు మేలు జరిగే విధంగా రూపకల్పన చేశారని తెలిపారు. మహిళలు బాగుంటేనే వారి ఇల్లు బాగుంటుందని, తద్వారా సమాజం, రాష్ట్రం బాగుంటుందని నమ్మి రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఇంత చేస్తున్న ముఖ్యమంత్రి ని, ప్రభుత్వాన్ని అభినందించకపోయినా ఫర్వాలేదు గానీ, పనీపాట లేని పది మంది పోగై ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. మహిళలకు అన్నివిధాలా అండగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే మనల్ని మనం అవమానించుకోవడమే అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నాలుగు అమలు చేశామన్నారు. మహిళ పేరుతోనే ఇళ్ళు రాబోతున్నాయని గత ప్రభుత్వంలో మాదిరిగా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదని, ఎవరి సిఫార్సులు అవసరం లేదన్నారు. భారతదేశంలో మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, మహిళలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారన్నారు. జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. సమస్యలు ఉంటే నేరుగా తనకు తెలుపవచ్చని, మణుగూరు ప్రజా భవన్ కార్యాలయంలో అందుబాటులో ఉంటామన్నారు. తనను కలవడానికి ఎటువంటి ఫైరవీలు అవసరం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, యువజన కాంగ్రెస్ నాయకులు కొరసా ఆనంద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మీరెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,అర్జున్, తాసిల్దార్ సూర్యనారాయణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, మాజీ సర్పంచులు, సెక్రటరీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.