
సుగుణమ్మ పోరాటానికి మహిళా ఐక్య వేదిక మద్దతు
సుగుణమ్మను ఆర్థికంగా మోసం చేసిన వెంకటేశ్వర్లు పై చీటింగ్ కేసు నమోదు చేయాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. స్థానిక కల్లూరులోని వెంకటేశ్వర్లు ఇంటి ముందు కురువ సుగుణమ్మ చేస్తున్న న్యాయ పోరాటానికి మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షురాళ్ళతో కలిసి అండగా నిలబడి సుగుణమ్మకు మద్దతు నివ్వడం జరిగింది. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ కమ్మ వెంకటేశ్వర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో మహిళలను ఆర్థికంగా మోసం చేయడం దారుణమని ఆమె అన్నారు. కురువ సుగుణమ్మ కల్లూరులోని కమ్మ వెంకటేశ్వర్లు ఇంటి ముందు కూర్చొని చేస్తున్న న్యాయ పోరాటం ఏదైతే వుందో అది ఈ రోజుకు రెండవ రోజు వివరాల్లోకి వెళితే, కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన కురువ సుగుణమ్మ ఆమె భర్త కె.పి.అమీన్ మరో ఇద్దరు వ్యక్తులు కలిసి కమ్మ వెంకటేశ్వర్లు దగ్గర మూడు ఎకరాల తొంభై నాలుగు సెంట్ల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అందుకు అడ్వాన్సుగా అరవై రెండు లక్షల రూపాయలు కమ్మ వెంకటేశ్వర్లుకు సుగుణమ్మ ఆమె భర్త మరియు భాగస్థులు కలిసి ఇవ్వటం జరిగింది. ఏడు నెలలకు పూర్తి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇద్దరూ అగ్రిమెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏడు నెలలకు డబ్బులు సర్దుబాటు చేసుకుని వెంకటేశ్వర్లును సుగుణమ్మ మరియు ఆమె భాగస్థులు కలిసి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని వెంకటేశ్వర్లను అడిగారు. అందుకు వెంకటేశ్వర్లు భూమి ధర పెరిగిందని, పెరిగిన ధర ప్రకారం అమ్ముతానని చెప్పాడు. దాంతో సుగుణమ్మ మేము కట్టిన డబ్బులు వాపసు ఇవ్వు లేకపోతే భూమి అయినా ఇవ్వు అని వెంకటేశ్వర్లను అడిగారు. వెంకటేశ్వర్లు డబ్బులు తిరిగి ఇస్తాను ఇస్తాను అంటూ కాలయాపన చేసి తర్వాత ఇచ్చేది లేదని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరిగిందని బాధితురాలు సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సుగుణమ్మ పన్నెండు సంవత్సరాలుగా న్యాయం కోసం రాజకీయ నాయకుల చుట్టూ, పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయి చివరకు మహిళా ఐక్య వేదికను ఆశ్రయించడం జరిగింది. నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ S.I మధుసూదన్ గారు మరియు పోలీసులు వచ్చి కురువ సుగుణమ్మను మరియు కమ్మ వెంకటేశ్వర్లును ఇరువురిని స్టేషన్ కు రమ్మని సమస్య పరిష్కారం చేద్దామని తీసుకుని వెళ్ళారు. సి.ఐ గారు రేపు ఉదయం 11.00 గంటలకు ఇరువురిని స్టేషన్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తామని చెప్పారు. కమ్మ వెంకటేశ్వర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో మహిళలను ఆర్థికంగా మోసం చేసుకుంటూ పోతుంటే కమ్మ వెంకటేశ్వర్లు అల్లుడు అయిన డి.యస్.పి. యుగంధర్ బాబు గారు ఆ మోసాలను సమర్థించడం సరికాదని పట్నం రాజేశ్వరి అన్నారు. మహిళలకు అండగా నిలబడాల్సిన పోలీసు అధికారి బంధుత్వం పేరుతో మహిళలను మోసం చేసేవారికి అండగా వుండటం బాధాకరమని ఆమె తెలిపారు.పోలీసు ఉన్నతాధికారులు సదరు డి.యస్.పి.పై వారి మామ కమ్మ వెంకటేశ్వర్ల మోసాలపై సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక టీమ్ పాల్గొన్నారు.