కుల దురహంకార హత్య
ప్రేమ వివాహం చేసుకున్నాడన్న ఒకే ఒక కారణంతో రంగారెడ్డి జిల్లా,షాద్‌నగర్ నియోజకవర్గం,ఫరూక్నగర్ మండలం,ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్‌ను దారుణంగా హత్య చేసి,పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది.ఈ కిరాతక చర్యను కుల దురహంకార హత్యగా కేవీపీఎస్ (కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం) ఖండించింది.సోమవారం ఈ ఘటనపై కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు.నిందితులకు మోయినాబాద్ పోలీసుల నిర్లక్ష్యం,వేధింపులే ఈ దారుణానికి మరింత ధైర్యం ఇచ్చాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కిడ్నాప్-హత్య-సజీవ దహనం”
గత నెల రోజుల్లో ఎర్ర రాజశేఖర్,భవాని చట్టబద్ధంగా మేజర్లుగా ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ వివాహాన్ని జీర్ణించుకోలేని వధువు తండ్రి కావలి వెంకటేష్ మొయినాబాద్ పోలీసుల సహకారంతో పోలీస్‌స్టేషన్‌లోనే రాజశేఖర్ తండ్రి మరియు అన్న జగన్‌పై దాడి చేసినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని కేవీపీఎస్ ఆరోపించింది.తాజాగా,కావలి వెంకటేష్ రాజశేఖర్‌ను”మాట్లాడుకుందాం”అని పిలిచి,నవాబుపేట ప్రాంతానికి తీసుకెళ్లి అమానుషంగా కొట్టి హత్య చేశారు.అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు.”ఇది మానవ మృగాల క్రూరత్వానికి నిదర్శనం,”అని పాలడుగు నాగార్జున పేర్కొన్నారు.పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు
రాష్ట్రంలో ఇటువంటి కుల దురహంకార హత్యలు ఇప్పటికే 142కి చేరడానికి పోలీసుల నిర్లక్ష్యం,చట్ట అమలులో వైఫల్యమే ప్రధాన కారణమని కేవీపీఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం వల్లే కుల హింసా ఘటనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
“ కేవీపీఎస్ డిమాండ్లు”
కేవీపీఎస్ ఈ దారుణ హత్యపై ప్రభుత్వాన్ని,పోలీసులను గట్టిగా డిమాండ్ చేసింది.వధువు తండ్రితో సహా అన్ని సహనిందితులను తక్షణమే అరెస్టు చేయాలి.హత్య కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలి.ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ త్వరగా జరపాలి.రాజశేఖర్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి,బాధిత కుటుంబానికి ₹50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.రంగారెడ్డి జిల్లా కలెక్టర్,ఎస్పీ స్వయంగా బాధితులను కలిసి న్యాయం కల్పించాలి.కులాంతర వివాహితల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది.ఈ ఘోర హత్య సమాజాన్ని కుదిపేసిందని,మరో కుల దురహంకార హత్య జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పాలడుగు నాగార్జున అన్నారు.