కూలీలను పనికి దూరం చేసే కుట్రలో కేంద్ర ప్రభుత్వం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను రద్దు చేసి, దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మోడీ 2025’ పేరుతో 197వ బిల్లు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య ఆరోపించారు.బుధవారం జఫర్గడ్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ బిల్లుతో ఉపాధి హామీ చట్టం చట్టంగా కాకుండా ఒక సాధారణ పథకంగా మారే ప్రమాదం ఉందని,దీని వల్ల లక్షలాది కూలీలు పనికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఉపాధి హామీ పథకానికి అరకొర నిధులు మాత్రమే కేటాయిస్తూ దీన్ని నీరుగారుస్తోందని మండిపడ్డారు.గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించేందుకు,భూమిలేని కూలీలు,బడుగు-బలహీన వర్గాలకు భరోసాగా నిలిచిన ఈ చట్టాన్ని రద్దు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.2005లో చట్టంగా రూపొందిన ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు పని హక్కు లభించిందని,అయితే కొత్తగా తీసుకొచ్చిన 197వ బిల్లు ద్వారా ఉన్న ఉపాధినే తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏడాదికి కేవలం 60 పని దినాలకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.ఇప్పటివరకు ఉపాధి హామీ పథకానికి కేంద్రం 90 శాతం,రాష్ట్రం 10 శాతం నిధులు అందిస్తుండగా,కొత్త విధానంలో కేంద్రం 60 శాతం,రాష్ట్రాలు 40 శాతం భారం మోయాల్సి వచ్చేలా రూపొందించడం రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారం మోపడమేనని తెలిపారు.నిధుల లేమితో ఈ పథకం పూర్తిగా అచేతనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఉపాధి హామీ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించే కుట్ర జరుగుతోందని,ఇది కూలీల హక్కులను కాలరాస్తుందని అన్నారు.197వ బిల్లును పూర్తిగా రద్దు చేసే వరకు సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.