క్రీడలతో శారీరక,మానసిక దృఢత్వం పెంపొందింపు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ,హైదరాబాద్ ఆధ్వర్యంలో జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం పదకొండవ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జ్యోతి ప్రజ్వలన చేసి,భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి,జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం దీపశిఖ రీలేను వెలిగించి క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థుల నుండి మార్చ్‌పాస్ట్ వందనం స్వీకరించిన కలెక్టర్,రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలకు హాజరైన విద్యార్థులను అభినందించారు.జనగామ జిల్లాలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ,ఏకాగ్రత,నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని తెలిపారు.విద్యార్థులు శారీరకంగా,మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతో కీలకమని,ప్రతి విద్యార్థి ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబర్చాలని సూచించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సిబ్బంది విద్యార్థులను సమర్థంగా పర్యవేక్షించాలని,శారీరక విద్య ఉపాధ్యాయులు నిష్పక్షపాతంగా పోటీలను నిర్వహించాలని ఆదేశించారు.జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించే లక్ష్యంతో విద్యార్థులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.గురుకుల విద్యాలయాల నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ ఆనంద్ వంటి ఆదర్శ వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శి బి.సక్రు నాయక్,జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి డా.బి.విక్రమ్,జిల్లా విద్యాశాఖ అధికారి కే.జితేందర్ రెడ్డి,మండల విద్యాశాఖ అధికారి జి.శంకర్ రెడ్డి,జనగామ,బహుళ మండల అధికారి హెచ్.అరుణకుమారి,మండల అధికారి ఎస్.విద్యారాణి,ప్రధానోపాధ్యాయులు పి.శ్రీనివాసరావు,ఉప ప్రధానోపాధ్యాయులు అలగోని నరసింహులు గౌడ్,వివిధ కళాశాలల ప్రధానోపాధ్యాయులు,క్రీడల సమన్వయకర్తలు జి.శ్రీనివాస్,డి.కిషన్,అలాగే వివిధ కళాశాలల శారీరక విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ గురుకులాల నుండి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక,నృత్య కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి,కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశాయి.