
-తెలంగాణ గిరిజన సంఘం (TGS) విమర్శ.
కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఏమాత్రం దోహదిపడేదిగా లేదని ప్రతి ఏడాది మోసం చేసినట్టుగానే ఏడాది కూడా అంకెల గారడితో మోసం చేసిందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మ నాయక్ ,ఆర్ శ్రీరాం నాయక్ లు ఒక ప్రకటనలో విమర్శించారు.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి గిరిజనుల అభివృద్ధి ,సంక్షేమం పట్ల పూర్తిగా విస్మరిస్తూ వస్తుందన డానికి బడ్జెట్లో కేటాయిస్తూవస్తున్న నిధులే అందుకు నిదర్శనమని అన్నారు. వచ్చే జనరల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనైనా ఈ ఏడాది బడ్జెట్ గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచుతుందని ఆశించామని అన్నారు. 45 లక్షల కోట్ల బడ్జెట్లో గిరిజనుల అభివృద్ధికి కేటాయించింది మాత్రం పిసరతేనని అన్నారు. దేశంలో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి ఏటా కేటాయిస్తున్న గిరిజన స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ పద్దు కింద గత ఏడాది 102 శాఖలకు గాను రివైజ్డ్ బడ్జెట్ లో 94,292 వేల కోట్లు కేటాయించగా ఏడాది కేవలం 25 వేల కోట్లు మాత్రమే పెంచి 1,19,509 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. ఇందులో గిరిజన సంక్షేమశాఖకు కేవలం 2166 కోట్లు మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన 25 వేల కోట్లు కూడా గిరిజనుల అభివృద్ధికి ఉపయోగపడే వాటిలో పెంచకుండా గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడని ఇతర శాఖలో పెంచడం అన్యాయమని అన్నారు.ఈ నిధులతో దేశంలో గిరిజన అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా చేస్తారో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన గిరిజన జనాభా నిష్పత్తి 10 శాతం ప్రకారం కేటాయించడంలో కూడా తీవ్రమైన అన్యాయం చేసిందని అన్నారు. విభజన చట్టంలో భాగంగా ఏర్పాటు చేస్తామన్న రెండు రాష్ట్రాల గిరిజన యూనివర్సిటీలకు కలిపి కేవలం కోటి రూపాయలు మాత్రమే కేటాయించి ద్రోహం చేసిందని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని వేలాది మంది గిరిజన విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందని అన్నారు. గిరిజన ప్రాంతం బయ్యారంలో ఏర్పాటు చేస్తామన్న ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఉసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 275 (1) ప్రకారం హక్కుగా కేటాయిస్తూ వస్తున్న నిధుల్లో గత ఎడాది 1350 కోట్లు కేటాయించగా రివైజ్డ్ బడ్జెట్ లో 925 కోట్లకు తగ్గించి తిరిగి ఏడాది 1472 కోట్లు కేటాయించిందని అన్నారు. దేశంలో అత్యంత వెనుకబడిన గిరిజన తెగలు అంతరించే దశలో ఉంటే వాటి అభివృద్ధికి గత ఏడాది 252 కోట్లు ఇవ్వగా రివైజ్డ్ బడ్జెట్ లో 124 కోట్లకు తగ్గించి ఈ ఏడాది 246 కోట్లు కేటాయించింది. అంటే అంతరిస్తున్న గిరిజన తెగల అభివృద్ధి కూడా నిధులు పెంచకపోవడం బాధాకరమని అన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో 3వేల కోట్లు అదనంగా పెంచి మొత్తం గిరిజన సంక్షేమానికి పెంచినట్టు అంకెల గారడికి పాల్పడిందనీ అన్నారు. గిరిజన విద్యార్థులకు ఇస్తున్న ఫెలోషిప్ కింద 119 కోట్లు తగ్గించి కేవలం 145 కోట్లు మాత్రమే కేటాయించడం గిరిజన విద్య పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. గత ఎనిమిది సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కేటాయించిన నిధుల నుండి వేలకోట్లు ఇతర పథకాలకు దారి మళ్లించిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో గిరిజన సబ్ ప్లాన్ స్ఫూర్తికి విరుద్ధంగా నిధులను కేటాయించడంతోపాటు పూర్తిగా నీరుగార్చే విధంగా వ్యవహరించిందని అన్నారు.