
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాల కోసం ధర్నా
జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం గ్రామపంచాయతీ కార్మికులు భారీగా ధర్నా నిర్వహించారు.తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలని,బట్టలు,సబ్బులు,నూనెలు,సేఫ్టీ పరికరాలు అందించాలని వారు డిమాండ్ చేశారు.వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్మికులు ఆందోళన కొనసాగించారు.యూనియన్ నేతలు మాట్లాడుతూ..వేతనాలు వెంటనే చెల్లించకుంటే దసరా సందర్భంగా గ్రామ గ్రామాన భిక్షాటన చేపడతామని హెచ్చరించారు.గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని, 2వ పిఆర్సి పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకురావాలని కోరారు.జివో నెం:60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలి.జివో నెం:51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి.ఉద్యోగ భద్రత,ప్రమోషన్లు,రిటైర్మెంట్ బెనిఫిట్స్,ఇన్సూరెన్స్,పిఎఫ్,బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.కాంగ్రెస్స్ పార్టీ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి పంచాయతీ అవసరాల ఆధారంగా కార్మికుల సంఖ్య పెంచి, వారిని పర్మినెంట్ చేయాలని,వేతనాలు పెంచాలని పేర్కొన్నారు.ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం,కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.తరువాత వినతిపత్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి వసంతకు మరియు కలెక్టరేట్ ఏవో కార్యాలయంలో సమర్పించారు.ఈ కార్యక్రమంలో పి.వెంకటేశ్వర్లు,ఎస్.కర్ణాకర్,పి.మల్లేష్,బి.బాలనరసయ్య,జే.కలమ్మ,సైదమ్మ,రమలావణ్య,రమణ,రేణుక,యాదమ్మ,కవిత తదితరులు పాల్గొన్నారు.