గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఉరి వేస్తున్న మోడీ ప్రభుత్వం
కేవైసీ మరియు డిజిటలైజేషన్ పేరుతో దేశవ్యాప్తంగా 27 లక్షల మంది ఉపాధి కూలీల పేర్లు జాబ్ కార్డుల నుండి తొలగించడం గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడవటమేనని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ప్రసాద్ ఆరోపించారు. చట్టాన్ని కాపాడుకునేందుకు గ్రామ స్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వాస్తవ రెడ్డి అధ్యక్షతన జరిగిన విస్తృత సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం వ్యవస్థను సద్దుమణిగించేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ మొబైల్ మోనిటరింగ్ సిస్టం (ఎన్ ఎం ఎం ఎస్)ను అమలు చేస్తూ ఆధార్–జాబ్ కార్డు–బ్యాంక్ లింకింగ్ పేరుతో లక్షలాది కార్డులను రద్దు చేసిందని తెలిపారు.పల్లెల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని పరిస్థితుల్లో పనిస్థలంలో ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనే నిబంధనలు కూలీలకు ఇబ్బందిగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనికి వారం రోజుల్లో వేతనాలు చెల్లించాలని చట్టం చెబుతున్నా, సంవత్సరాల తరబడి చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని విమర్శించారు.వ్యవసాయ సంబంధ అభివృద్ధి పనులను విస్మరించి, పేదలకు ఉపయోగపడే పనులను తొలగించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పేదల పొట్టపై కొరడా దెబ్బగా ఉందని ప్రసాద్ అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని వెనక్కి తీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, ఇటువంటి చర్యలు కొనసాగితే దేశవ్యాప్తంగా బహుళ స్థాయిలో ఉద్యమాలు ప్రారంభిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అంబాల స్వరూప, జిల్లా నాయకురాలు లోకిని స్వరూప, వేలు రజిత, చిలక రాఘవులు తదితరులు పాల్గొన్నారు