గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలి:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని నిరసిస్తూ శనివారం గన్ పార్క్ వద్ద శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ వందమంది అభ్యర్థులు శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ మేరకు ఆయన మీడియా ప్రకటన విడుదల చేశారు.గురుకుల టీచర్ పోస్టులు,పాలిటెక్నిక్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పరీక్షలు పూర్తయిన తర్వాతే గ్రూప్-2 నిర్వహించాలన్నారు.ఆగస్టు నెలలోనే ఐబీపీఎస్,ఆర్ఆర్ బీ వంటి అనేక పరీక్షలు ఉండడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
రాష్ట్రంలో వరుసగా పోటీ పరీక్షల షెడ్యూలు విడుదల కావడంతో లక్షలాది మంది గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన చెందుతూ,ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ కావాలో అర్థంకాక టీఎస్పీఎస్సీ ముట్టడించారన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన గ్రూప్-2 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం హెయమైన చర్యగా అభివర్ణించారు.
గతంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 తో సహా అన్ని పరీక్షల పేపర్లు లీకేజీ కావడం వల్లనే ఈ దుస్థితి నెలకొందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా అభ్యర్థులు రోడ్లపై ధర్నాలు చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. గ్రూప్-2 అభ్యర్థుల విన్నపం మేరుకు మరో మూడు నెలలు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి పరీక్షకు మధ్య మూడు నెలల గ్యాప్ ఉండేలా చర్యలు తీసుకుంటామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.