
జనగామలో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం సిపిఎం మహా ధర్నా

మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు
ఏప్రిల్ 11 వరకు స్పందన రాకపోతే జాతీయ రహదారి దిగ్బంధనానికి సిద్దమని సిపిఎం హెచ్చరిక
ఈ69న్యూస్ జనగామ
జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం ఇందిరమ్మ కాలనీ వద్ద నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డుపై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ,సిపిఎం పార్టీ పట్టణ మరియు మండల కమిటీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున పాదయాత్ర మరియు ధర్నా నిర్వహించారు.బాణాపురం ఇందిరమ్మ కాలనీ సిపిఎం దీక్షా శిబిరం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు వందలాది మంది పార్టీ కార్యకర్తలు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.కళాకారులు డప్పు చప్పుళ్లతో,కోలాట నృత్యాలతో ఆకట్టుకున్నారు.పాదయాత్రను పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు జెండా ఊపి ప్రారంభించారు.కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా సిపిఎం శ్రేణులు ఎర్రజెండాలతో ప్రాంగణాన్ని ఎరుపెక్కించారు.పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సంబంధిత ఎన్హెచ్ అధికారులు ధర్నా వద్దకు వచ్చి మాట్లాడించారు.అయితే,ఎన్హెచ్ అధికారుల అభ్యంతరకర వ్యాఖ్యలపై సిపిఎం శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం,జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో సిపిఎం ప్రతినిధి బృందం చర్చలు జరిపింది.ఈ చర్చలలో,మూడు రోజుల్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.ఈ విషయాన్ని ఎన్హెచ్ ఏఈ వెంకటేష్ ప్రజల సమక్షంలో ప్రకటించారు.ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడుతూ,నేషనల్ హైవే అథారిటీ అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని,72 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.నేషనల్ హైవే అథారిటీ డీఈ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం మానుకోవాలని,ప్రమాద స్థలంగా గుర్తించినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదని విమర్శించారు.సుమారు 10,000 మంది ప్రజలకు ఉపయోగపడే ఈ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం అత్యవసరమని,అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంతవరకు సిపిఎం పార్టీ ప్రజా ఆందోళనలు కొనసాగుతాయని రాపర్తి రాజు హెచ్చరించారు.ఏప్రిల్ 11 వరకు దీక్షా శిబిరం వద్దకు జిల్లా ఉన్నత అధికారులు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయకపోతే,జాతీయ రహదారిని వందలాది మందితో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్,జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి,సుంచు విజేందర్,బోడ నరేందర్,భూక్య చందు నాయక్,చిట్యాల సోమన్న,ఎండి అజారుద్దీన్,బిట్ల గణేష్,సీనియర్ నాయకులు ఎండి దస్తగిరి,పార్టీ పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం,బాల్నే వెంకటమల్లయ్య,పల్లెర్ల లలిత,మంగ బీరయ్య,బొట్ల శ్రావణ్,పంతం సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.