
సిఐటియు జిల్లా కార్యదర్శి వి వి నరసింహ
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే జీవో నెంబర్ 12 ను వెంటనే సవరించి, కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండే సంక్షేమ పథకాలు అందించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి వి వి నరసింహ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ గారికి, ఏసీఎల్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణానికి 10 లక్షలు, సహజ మరణానికి రెండు లక్షల పెంచుతూ, శాశ్వత పాక్షిక అంగవైకల్యం ఈ నాలుగు స్కీం లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 12ను తీసుకువచ్చిందని దీనిని సీఐటీయు సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. జీవో విడుదల చేసిన రెండు రోజులకే ప్రైవేటు భీమా కంపెనీలైన క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి 250 కోట్లు, ఏర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి 94 కోట్లు, ట్రైన్ బ్లేజర్ అనే బ్రోకర్ సంస్థ ద్వారా 346 కోట్లు ప్రైవేటు భీమా కంపెనీలకు కార్మికుల సొమ్మును అక్రమంగా బదిలీ చేశారని విమర్శించారు. 1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం నిబంధనలు ఉల్లంగించి ప్రైవేటు కంపెనీలకు కార్మిక వర్గ సొమ్మును ధారా దత్తం చేయడాన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.కేంద్ర చట్టం ప్రకారము వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ నియమించి వారి నిర్ణయం ప్రకారం ఖర్చు చేయాలని కానీ వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించకుండా ప్రభుత్వం కార్మిక శాఖ అధికారులు ఎటువంటి గుర్తింపు లేని ఇన్సూరెన్స్ కంపెనీలకు స్కీములు అప్పగించి కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో ఉంటేనే సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తే అవినీతి పెరిగి కార్మికులకు పరిహారాలు అందే అవకాశమే లేకుండా పోతుందని అన్నారు. ఇప్పటికే కార్మికులకు హెల్త్ టెస్టుల పేరుతో సిఎస్సి సంస్థకు 463 కోట్లు దోచి పెట్టారని విమర్శించారు. ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిధులను దారి మళ్లీస్తూ కార్మికులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కావున ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 12 సవరించి, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కార్మికులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కార్మికులు పాంటన్న, సామెల్, నర్సింలు,బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదాలతో ఉప్పేర్ నరసింహ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జోగులాంబ గద్వాల జిల్లా.