టీ.పి.టి.ఎల్.ఎఫ్,ఎస్.ఎఫ్.ఐ ధర్నా
ఫ్యాకల్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఏస్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఉద్యోగాల పేరుతో విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటు–టీ.పి.టి.ఎల్.ఎఫ్,ఎస్.ఎఫ్.ఐ నాయకులు మేడ్చల్ జిల్లా గగన్‌పహాడ్ సమీపంలోని ఏస్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయులు,అధ్యాపకుల సంఘం (టీ.పి.టి.ఎల్.ఎఫ్)మరియు విద్యార్థి సమాఖ్య (ఎస్.ఎఫ్.ఐ.)ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా టీ.పి.టి.ఎల్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆ.విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఏస్ కళాశాలలో అర్హతలేని ఉపాధ్యాయులను నియమించి బోధన చేపట్టడం,వారికి ఉన్నట్లుగా కళాశాల వెబ్సైట్లో చూపించడం తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు.ఒకరి తప్పు పేరుతో మొత్తం విభాగంలోని ఉపాధ్యాయులను తొలగించడం అన్యాయం అన్నారు.ఉద్యోగం నుంచి తొలగించే ముందు రెండు నెలల ముందుగానే నోటీసు ఇవ్వాలనే నిబంధనలను కాలేజ్ యాజమాన్యం ఉల్లంఘించిందని ఆరోపించారు.అకడమిక్ సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులను తొలగించడం కక్షపూరిత చర్యలకు నిదర్శనం అని ఆయన అన్నారు.ఎస్.ఎఫ్.ఐ.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ..కళాశాలలో నియమించబడిన నియామకాధికారి నాలుగవ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల వద్ద ఒక్కొక్కరి నుంచి పది వేలు నుంచి ముప్పై వేల వరకు వసూలు చేసి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు.తల్లిదండ్రులు ప్రశ్నించగా మీ ధృవపత్రాలు సరిగా లేవు అని బెదిరించి పంపడం దారుణమని పేర్కొన్నారు.విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని,లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.టీ.పి.టి.ఎల్.ఎఫ్ రాష్ట్ర నాయకుడు కొమ్ము విజయ్ మాట్లాడుతూ..ఈ ఘటనలన్నీ యాజమాన్యానికి తెలియక జరిగాయా లేక తెలిసి జరిగాయా అన్నది ప్రశ్నార్థకమని అన్నారు.నాయకులు,తల్లిదండ్రులతో మాట్లాడకుండా తప్పించుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.ఇలాంటి అన్యాయ పద్ధతులు కొనసాగిస్తే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ.కార్యకర్తలు సాయి,రాజేష్,నీరజ్,గణేష్,అభినవ్,సాయిదత్త,కిషోర్,అరుణ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.