
- ఎస్. వీరయ్య, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు
– ఎస్. వీరయ్య, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారిని కదిలించేందుకు ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఐక్యంగా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. ఈరోజు (తేది: 20`09`2025)న తెలంగాణ పబ్లిక్ Ê ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల (సెప్టెంబర్) 20,21 తేదీలలో జరుగుతున్న సందర్భంగా ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి నారాయణగూడ, చిక్కడపల్లి వయా ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు నగర కమిటీల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో జరిగిన సభలో వారు మాట్లాడారు. సభకు నగర కార్యదర్శి కె. అజయ్‌బాబు అధ్యక్షత వహించారు.
ఎస్. వీరయ్య గారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికవర్గానికి మెడకు ఉరితాడు బిగించాడని, మోటార్ వాహనాల చట్టం`2019లో అగ్రిగేటర్స్‌కి ప్రవేశం కల్పించాడని, సింగిల్ ఓనర్ కమ్ డ్రైవర్స్ లేకుండా డ్రైవర్లందరూ ఆన్‌లైన్‌లోకి తప్పనిసరిగా చేరే విధంగా పరిస్థితులు సృష్టిస్తున్నారని, దీనివల్ల రాబోయే కాలంలో సింగిల్ ఓనర్ కమ్ డ్రైవర్స్ స్వతంత్రంగా కనబడకుండా పోయే ప్రమాదం ఉందని, ఈ వైఖరిపై ట్రాన్స్పోర్ట్ రంగంలోని కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించి పరిస్థితులు మనకనుకూలంగా మారే వరకూ పోరాటం చేయాలన్నారు. అగ్రిగేటర్స్ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చట్టాలు చెప్తుంటే వాటిని తప్పించుకునే దానికోసం ఆన్లైన్ సంస్థల యాజమాన్యాలు మేము కస్టమర్‌కి సర్వీస్ ప్రొవైడర్‌కు లింక్‌గా ఉన్నామే గానీ, మేము యాజమాన్యం కాదని చెప్పి తప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆన్లైన్ సంస్థల దోపిడీని ఎదుర్కోవాలంటే అన్ని రంగాల్లో ఉన్న రవాణారంగ కార్మికులంతా ఏకమై ఉద్యమం నిర్వహించి మన హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఏర్పడిరదని తెలిపారు. కేరళ ప్రభుత్వం డ్రైవర్ల కోసం సవారీ యాప్ తీసుకొచ్చి 8 శాతం కమిషన్ తీసుకుంటుందని, ఆ కమిషన్‌లో 6 శాతం తిరిగి సంక్షేమ బోర్డులోకి డ్రైవర్ల సంక్షేమానికే కేటాయిస్తుందని, ఈ విధంగా మిగిలిన ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయని ప్రభుత్వాలు మెడలు వంచి ఇటువంటి స్కీములను సాధించుకునేలాగా, సమస్యలను పరిష్కరించుకునే లాగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల్లో ఈ సమస్యలపై కర్తవ్యాలు రూపొందిస్తామని తెలిపారు.
ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి హామీ ఇచ్చారని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ట్రేడిరగ్ సంఘాలతో చర్చలు కూడా జరిపారు. కానీ ఇప్పటివరకు దాని మీద ఏమాత్రం ప్రకటన చేసిన పరిస్థితి లేదు. ఈ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థమవుతుందని, ఆన్లైన్ సంస్థల దోపిడీని అరికట్టాలని కార్మికవర్గం కోరుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వారికి సాగిలపడుతున్నాయని, వారి దోపిడీని కొనసాగించడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం బిజినెస్ పీక్ అవర్స్‌లో చార్జెస్ 20% వరకు పెంచుకోవచ్చునని పర్మిషన్ ఇచ్చారని, ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకార్ యాప్ తీసుకొస్తామని ఘనంగా ప్రకటించిందని, కానీ ఇంతవరకు వాటి విధివిధానాలు రూపొందించలేదని, వెంటనే యాప్ తీసుకురావాలని, ఆ యాప్ పరిధిలోకి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్‌ని కూడా కలపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కంటిన్యూగా ఇచ్చిన రూ.5 లక్షల ప్రమాద బీమా స్కీమ్‌ని కొనసాగించకుండా స్తబ్దతకి గురిచేసిందని, వెంటనే ప్రమాద బీమా స్కీమ్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ఆ స్కీమ్ రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు.
సిఐటియు నగర అధ్యక్షులు కుమార్ స్వామి, సిఐటియు సౌత్ కమిటీ కార్యదర్శి ఎం. శ్రావణ్ కుమార్, ఏఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ సౌత్ కమిటీ కార్యదర్శి ఎల్. కోటయ్యలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తొలుత బాబర్ ఖాన్ ఆహ్వానం పలుకగా, సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఉమేష్ రెడ్డి వందన సమర్పణ చేశారు. ర్యాలీలో సిఐటియు నగర నాయకులు జి. రాములు, జంగయ్య, ఏఐఆర్‌టిడబ్ల్యూఎఫ్ నగర నాయకులు ఎండి. కలీం సాబీర్, ముఖేష్ శర్మ, మాజీద్ గౌస్, శ్యామ్, కోటి, మోయిన్, విష్ణు అర్బాజ్ ఖాన్, మహేష్ తదితరులు నాయకత్వం వహించారు.