తేది: 27.02.2023 నల్లగొండ.
విద్యాసంస్థల్లో పర్యవేక్షణ కమిటీలు,
టోల్ ఫ్రీనంబర్‌ను ఏర్పాటు చేయాలి
పాలడుగు ప్రభావతి ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.
మెడికో డాక్టర్ ప్రీతి సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు ప్రయత్నించి నిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ మృతిచెందడం అత్యంత బాధాకరం.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి పర్యవేక్షణ కమిటీలు, కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని పాలడుగు ప్రభావతి ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు సాయత్రం ఐద్వా ఆధ్వర్యంలో నల్లగొండ భాస్కర్ టాకీస్ సెంటర్ వరకు కొవ్వొత్తుల తో ర్యాలీ నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతీ మాట్లాడుతూ డాక్టర్ ప్రీతి మృతిపట్ల సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది.
ఇటీవలికాలంలో ర్యాగింగ్, సీనియర్ల వేధింపులు, పని ఒత్తిడి తధితర కారణాల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న వరంగల్‌లోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని తోటి విద్యార్థులు ఆమె ఫోటోలు సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆందోళన కలిగిస్తున్నది.
ప్రతి విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు వేయాలని 1997లో ర్యాగింగ్ నిరోధక చట్టం మరియు 2009లో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నప్పటికీ ఈ కృషి జరగడం లేదు. 2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 32 ర్యాగింగ్ కేసులు యూసీజీకి వచ్చినట్లు స్వయంగా కేంద్ర మానవ వనరుల శాఖనే పేర్కొన్నదంటే ర్యాగింగ్ ఎంత ప్రమాదకరంగా ఉన్నదో అర్థమవుతుంది. విద్యార్థుల నుండి ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి పూనుకోవడంలో బాధ్యులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం, ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియో ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప దీనిపై ప్రభుత్వం చిత్తశుద్ది కనపర్చడంలేదు.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిరోధించేందుకు యూజీసీ, ర్యాగింగ్ మార్గదర్శకాలు పాటించాలని, యాంటీ ర్యాగింగ్ స్వ్కాడ్స్‌ను ఏర్పాటు చేసి ఆయా నంబర్లను బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి విద్యా సంస్థలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని, కమిటీల్లో తల్లిదండ్రులతో పాటు, సైక్రాటిస్ట్, సైకాలజిస్ట్‌లను కూడా భాగస్వాములను చేసి తరచుగా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, సురక్షితమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణ కుమారి కమిటీ సభ్యురాలు మంజుల నిశ్రత్ ఖాన్ శ్రావణి లక్ష్మి మమత భవాని భారతి పార్వతి తదితరులు పాల్గొన్నారు.