
జనగామ జిల్లా జఫర్ఘఢ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో యూరియా బస్తాల పంపిణీపై వివాదం చెలరేగింది. ఎరువు డీలర్లు రైతులకు షరతులు పెట్టడంతో పాటు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.రైతుల వివరాల ప్రకారం,ఒక్క ఆధార్ కార్డుకు ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని,అంతేకాకుండా సాధారణ యూరియా బస్తా కొనాలంటే తప్పనిసరిగా నానో యూరియా కూడా కొనాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.అదనంగా,బిల్లులో యూరియా ధర 267 రూపాయలు మాత్రమే చూపిస్తూ,వాస్తవానికి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. నానో యూరియా కోసం 200 రూపాయలు తీసుకుంటున్నారు అని రైతులు ఆరోపించారు.“మాకు కావలసింది ఒక్క సాధారణ యూరియా బస్తానే. నానో యూరియా అవసరం లేదు.కానీ డీలర్లు బలవంతం చేస్తున్నారు. పైగా బిల్లుకి మించి డబ్బులు వసూలు చేస్తున్నారు” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితితో గ్రామంలో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని అక్రమాలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.