దళితబంధు పథకంలో దళిత వికలాంగులకు 5 శాతం వాటా అమలు చేయాలి
Jangaon
30-11-2022
దళితబంధు పథకంలో రాజకీయ జ్యోక్యాన్ని నిరోదించాలి!!
డిసెంబర్ 26న జరిగే భారీ బహిరంగసభను జయప్రదం చేయండి!!!
(వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్.)
దళితబంధు పథకం నిరుపేద దళితుల జీవితాలలో ఆర్థికప్రగతికి దోహద పడుతుందనుకుంటే రాజకీయ జోక్యంతో గులాబీ బందులా మారిందని, ఈ దళితబంధు పథకం ఎంపికలో దళిత వికలాంగుల ప్రస్తావనే మరిచిందని తక్షణమే దళితబందులో నిరుపేద దళిత వికలాంగులకు 5 శాతం కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దివి: 30-11-2022 బుధవారం రోజున ఎన్పిఆర్డీ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన జనగామ జిల్లా డిసిపి సీతారాం గారితో ఎన్పిఆర్డీ అఖిల భారత 3వ మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా డీసీపీ సీతారాం మాట్లాడుతూ సమాజంలో వికలాంగులకు సామాజికన్యాయం, చట్టం దృష్టిలో అందరితో వీరు కూడా సమానమే అని అన్నారు. అన్ని వర్గాలకు కల్పించినట్లే వీరికి సమాన అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. 2016 ఆర్పిడి చట్టం ప్రకారం వికలాంగులను అవమానపరచిన, దూషించిన, వివక్ష ప్రదర్శించిన, హేళన చేసిన శిక్షించే అధికారం ఉందన్నారు. 2016 ఆర్పిడి చట్టంపై జిల్లాలో పై నుండి క్రింది స్థాయి పోలీస్ అధికారుల వరకు అవగాహన కల్పించి, జిల్లలో చట్టాన్ని పటిష్టంగా అమలుచేస్తామని తెలిపారు. అనంతరం ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల ఆర్థికాభివృద్ధికి తీసుకొచ్చిన దళితబంధు పథకం నిరుపేద దళితుల జీవితాలలో ఆర్థికప్రగతికి దోహద పడుతుందనుకుంటే రాజకీయ జోక్యంతో దళితబంధు పథకం గులాబీ బందులా మారిందనన్నారు. ప్రభుత్వం దళితబంధు పథకం ఎంపికలో దళిత వికలాంగుల ప్రస్తావనే మరిచిందని తక్షణమే దళితబందులో నిరుపేద దళిత వికలాంగులకు 5 శాతం వాటా కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్ లో కేవలం 17, 700 కోట్ల రూపాయలు దళితుల సంక్షేమం కోసం కేటాయించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు? ప్రభుత్వం జనగామ జిల్లాలో కొన్ని మండలాలను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు, బందువులకు, ముఖ్యకార్యకర్తలకు ఈ పథకం వర్తింపజేస్తూ అసలైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తలోరకంగా మాట్లాడి ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారని, దీనివల్ల రానున్న ఎన్నికలో ప్రజలే తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. జనగామ జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాల్లో మొత్తం 60818 దళిత కుటుంబాలు ఉంటే కేవలం మొత్తంగా దళితబంధు పథకం కింద 194 మందిని ఎంపిక చేశారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దళితులు వేలసంఖ్యలో ఉండగా అతితక్కువ మందిని ఎంపిక చేయడంపై మిగతా దళితులలో ఆందోళన, గందరగోళం ఏర్పడుతుందన్నారు. ఇప్పటివరకు దళితబందులో 5 శాతం దళిత వికలాంగుల వాటా ప్రకటించకపోవడంతో ఈ ప్రభుత్వం వికలాంగుల పట్ల వివక్ష చూపుతుందనే అపోహ, అనుమానం కలుగుతుందని అన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 37(బి) ప్రకారం అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 5 శాతం వాటా వికలాంగులకు కేటాయించాలని, అలాగే సెక్షన్ 24(1) ప్రకారం సాధారణంగా ఇచ్చే లబ్దిలో 25 శాతం అదనంగా వికలాంగులకు ఇవ్వాలని తెలిపారు. ఈ పథకం కింద ఎంపికైన వారిలో అధికారపార్టీ అండదండలున్న వారికే దళితబందు వర్తింపజేస్తున్నారని విమర్శించారు. ఇది దళితబందు పథకంగా కాకుండా గులాబీ పథకంగా మారిందని విమర్శించారు. తక్షణమే దళితబంధు పథకంలో అర్హులైన వికలాంగ దళితులకు 5 శాతం వాటా ప్రకారం మొదటి ప్రాధాన్యత ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ దళితబంధు పథకంలో రాజకీయ జోక్యం లేకుండా ప్రతిఘటించాలని తెలిపారు. ఇలాగే ప్రభుత్వం మొండిగా కొనసాగించాలని చుస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 26న హైదరాబాద్ నగరంలో వికలాంగుల సమస్యలపై భారీ బహిరంగసభ, డిసెంబర్ 27, 28 తేదీలలో అఖిల భారత 3వ మహాసభలు ప్రతినిధులతో ఉంటుందని, ఈ మహాసభలలో వికలాంగుల సమస్యలను చర్చించి భవిష్యత్ పోరాటాల ప్రణాళిక రూపకల్పన రూపొందిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వికలాంగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనగామ మండల కార్యదర్శి ఇట్టబోయిన మధు, బచ్చన్నపేట మండల కార్యదర్శి కొత్తపల్లి రమేష్, మండల నాయకులు బండ్రు శ్రీశైలం, రావుల శ్రీనివాస్, గుర్రం రమేష్, ఎం.డి.అన్వర్ నిడిగొండ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.