
దేశ భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్ పార్టీదే
యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర చేపట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి టౌన్ లోని స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి అంబేడ్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ముఖ్య అతిధులుగా ఏఐసిసి సెక్రటరీ, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు.
ర్యాలీ మధ్యలో రాజీవ్ గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలను పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం అంబేడ్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రోడ్ షో లో వారు మాట్లాడుతూ..
దేశ భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్ పార్టీదేనని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని అన్నారు.
భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ గాంధీ ఆలోచనలను భారత్ జోడో సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాలల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నదని అన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపి అధికారం కోసం ఓట్లు పొందడానికి మతం పేరిట దేశంలో చిచ్చు పెట్టి ఓట్లు పొంది అధికారం చెలాయించాలని చూస్తోందని అన్నారు. మోదీ ప్రభుత్వం బహుళ జాతి కంపెనీలకు దేశ సంపద, వనరులను ధారాదత్తం చేస్తున్నదని ఆరోపించారు.
దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజన రాజకీయల వల్ల దేశంలోని ప్రజల మధ్య విభజన ఏర్పడింది అని, మతాల, ప్రాంతాల, కులాల, ఆహారపు అలవాట్లను అడ్డంపెట్టుకొని ప్రజల మధ్య దూరం పెంచారని అన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 145 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లకు పైగా భారత్ జోడో యాత్ర పేరు మీద రాహుల్ గాంధీ పాదయాత్ర చేశాడని తెలిపారు. ఈ యాత్రకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి అక్కున చేర్చుకున్నారని అన్నారు.
గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని, ఇంత కాలం నుండి కానిది, ఈ మూడు నెలల్లోనే ఒక్కో నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు ఎలా ఇస్తారని కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మోరంచపల్లి, వెంకటేశ్వర్లపల్లి, కుందనపల్లి, సుబ్బక్కపల్లి, పెద్దంపల్లి, కురుమపల్లి, వెంచరామి, అంకుశాపూర్, చైన్ పాక, రామకృష్ణా పూర్(వి) తదితర గ్రామాలల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయిందని అన్నారు. వరదలతో నష్టపోయిన నియోజకవర్గ ప్రజలను ఆదుకోవడానికి ఈ సీఎం కు తీరిక లేదా అని ప్రశ్నించారు.
అదేవిధంగా, ఇటీవల చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు పిడుగుపడి మృతి చెందిన ఇద్దరు మహిళలను స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కనీసం కన్నెత్తి చూడకపోవడం సిగ్గు చేటని అన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి, గాయపడ్డ వారికి కూడా మెరుగైన వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు