
నల్గొండ,ఆగస్టు 4 (ఈ69 న్యూస్)
దేశ సమగ్రతను,ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.సోమవారం నల్గొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మోడీ ప్రభుత్వం మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతోందని తీవ్రంగా విమర్శించారు.తమకు ఓటు వేయని ముస్లిం,క్రిస్టియన్ మైనార్టీల ఓట్లను తొలగించి,వారి పౌరసత్వంపై ప్రశ్నలు తీసుకొచ్చేందుకు కేంద్రం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని పేర్కొన్నారు.బీహార్‌లో 65 లక్షల ఓట్ల తొలగింపు ఇదే కుట్రలో భాగమని అభిప్రాయపడ్డారు.మోడీ మౌనం తగదు,ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించాలి
‘ఆపరేషన్ సింధూరం’అంశంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మోడీ ప్రభుత్వ అబద్ధాల్ని బహిర్గతం చేస్తున్నాయని తమ్మినేని పేర్కొన్నారు.శత్రు దేశం పాకిస్తాన్ అధికారి మునీర్‌కు ట్రంప్ విందు ఇచ్చిన విషయంపై మోడీ నోరు మెదపకపోవడాన్ని దేశ సమ్మానాన్ని తక్కువ చేయడంగా అభివర్ణించారు.ట్రంప్ భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధించడాన్ని కూడా గట్టిగా ఖండించాలన్నారు.రాష్ట్రంలో కాలయాపన పాలన
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలు నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.రుణమాఫీ,రైతు భరోసా,ఇళ్ల స్థలాల పంపిణీ వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు.ఎంపిక చేయకుండా అందరికీ ఇండ్లు,ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నారు.ప్రాజెక్టుల పూర్తి అవసరం
నల్గొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని,సాగర్ ఎడమకాలువ పరిధిలోని వ్యవసాయ భూములను ప్రాజెక్టులో భాగంగా పరిగణించి ప్రభుత్వమే నిర్వహించాలన్నారు.యూరియా కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,నారి ఐలయ్య,డబ్బికార్ మల్లేష్,పాలడుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.