దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ
పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు బుధవారం ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కేకు కోసి నేతలకు తినిపించారు.అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. దేశసేవకై తన జీవితాన్నే అంకితం చేసిన ఉక్కు మహిళ దేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు. ఆ మహనీయురాలి జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేదల ముంగిటకు బ్యాంకు సేవలను తీసుకువచ్చేందుకు బ్యాంకులను జాతీయం చేశారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరాగాంధీ పథకాలు ఆదర్శమన్నారు. గత ప్రభుత్వ పాలనలో గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరుగు అయిందని, కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత గృహ విద్యుత్ అందించి అండగా నిలిచిందన్నారు. ఇందిరా గాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.