ధర్మసాగర్ మండలంలో అక్రమంగా సాగుతున్న మట్టి దందా
Uncategorizedపట్టించుకోని సంబంధిత అధికారులు
ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
తెలుగు గళం ధర్మసాగర్
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో అక్రమంగా మట్టి తవ్వకాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.ఓ వైపు ప్రకృతి సంపద కళ్లముందే అన్యాక్రాంతమవుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంటున్నారు.ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తం గండి కొట్టుతున్నా పట్టించుకోవడం లేదు.ఒక ఘనపు మీటరు మట్టి తోలేందుకు ప్రభుత్వానికి రూ.20 చెల్లించాలి.గతంలో ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపు సాగేది. ప్రస్తుతం టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు.ఒక టిప్పర్‌లో 12 ఘనపు మీటర్ల వరకు మట్టి పడుతుంది.ఈ లెక్కన రాయల్టీ రూపంలో టిప్పర్‌కు ప్రభుత్వానికి రూ.240 చెల్లించాలి.మండలంలో చాలా చోట్ల మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.ఇలా రోజుకు రాత్రింబవళ్లు సుమారు వెయ్యి టిప్పర్ల మట్టి అక్రమంగా తరలిపోతోంది.ఇలా నెలకు దాదాపు రూ.73 లక్షలు ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి గొడుతున్నారు.ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ.9 కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోతోంది.అంటే..అనుమతులు లేకుండా రాయల్టీ చెల్లించకుండానే ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు.అక్రమ మట్టి తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన ప్రభుత్వ శాఖలు.. మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నందు వల్లే అక్రమార్కుల ఆటలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలూ ఉన్నాయి. అంతేకాదు.. రాజకీయ పలుకుబడి అక్రమ మైనింగ్‌పై తీవ్ర ప్రభావమే చూపుతోంది.అక్రమ మట్టి తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతాల్లో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తే అధికార పార్టీ నేతల అందదండలు ఉన్నాయని చెప్పి వ్యాపారులు బెదిరింపులకు దిగుతున్నారు. ఫలితంగా అప్పుడో ఇప్పుడో తనిఖీలకు వెళ్లే అధికారులు నెలవారీ మామూళ్లు అందుతుండటంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.హనుమకొండ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఎ లుకుర్తి,సాయి పేట,ముప్పారం,రాంపూర్, కరుణాపురం గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇప్పటికీ భారీగా మట్టి ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అక్రమ మట్టిని తరలించకుండా చూడాలని స్థలాలను కోరుతున్నారు.