నామ నాయక్ సేవలకు జిల్లా యంత్రాంగం ప్రశంస
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించిన అధికారిక వేడుకలలో ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో నడుస్తున్న చెనగలగడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ నాయక్‌కు మరోసారి ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. జిల్లా స్థాయిలో విద్యారంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తించిన జిల్లా యంత్రాంగం ఈ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించింది.
ఇంతకుముందు కూడా జిల్లా స్థాయి కార్యక్రమాల్లో తన సేవలకు గుర్తింపుగా ప్రశంసలు, సత్కారాలు అందుకున్న నామ నాయక్, ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ అదే స్థాయి గౌరవాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐ.ఏ.ఎస్ చేతుల మీదగా స్వీకరించడం విశేషంగా నిలిచింది. గిరిజన విద్యార్థుల విద్యా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ఆశ్రమ పాఠశాలల్లో క్రమశిక్షణ, విద్యా ప్రమాణాల పెంపుదలలో ఆయన పోషిస్తున్న పాత్రను అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు.
చేన్నంగలగడ్డ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాకుండా, వారిలో సామాజిక విలువలు, దేశభక్తి భావనలు, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాల్సిన గుణాలను పెంపొందించడంలో నామ నాయక్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు విద్యారంగంలో ముందుకు సాగేందుకు ఆయన చూపుతున్న చొరవ, మార్గదర్శనం అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు.
ఒకే ప్రధానోపాధ్యాయుడికి పునరావృతంగా లభిస్తున్న ఈ గౌరవం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తోందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. నిబద్ధత, క్రమశిక్షణ, విద్యాపట్ల అంకితభావం ఉంటే గుర్తింపు తప్పక లభిస్తుందనే విషయానికి ఇది నిదర్శనమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నామ నాయక్ మాట్లాడుతూ, తనకు లభించిన ఈ గౌరవం వ్యక్తిగత విజయంగా కాకుండా, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి గుర్తింపుగా భావిస్తున్నానని అన్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బంగారంగా మారేలా మరింత అంకితభావంతో పనిచేస్తానని, విద్య ద్వారా సమాజ మార్పు సాధ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.