
ఈ69న్యూస్ జనగామ జిల్లా:- రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద నేషనల్ హైవే పై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రమాదాలకు గురి కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం వివిధ ప్రజా సమస్యలపై కలెక్టరేట్ ఏవో మన్సూరి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడుతూ..నేషనల్ హైవే అథారిటీ సంబంధించిన అధికారులు నిర్లక్ష్య ధోరణి అనాలోచిత నిర్ణయం ప్రణాళిక బద్దంగా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం వలన నిడిగొండ వద్ద యూటర్న్ మీదుగా వెళ్లే గ్రామాల వాహనదారులు ప్రజలు తరచు ప్రమాదాలకు గురై ఇప్పటికే 15 మంది మృత్యువాత పడ్డారని వారికి సంబంధించిన వివరాలతో అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు.ప్రమాదాల నివారణకు అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.ఇదే హైవే రోడ్డు పక్కన పాత బావి ఉన్నది ఈ బావిని పూడ్చివేయక పోవడం కూడా నేషనల్ హైవే వారికి సంబంధించిన నిర్లక్ష్యమే కనపడుతుంది అన్నారు.ఈ పాత బావి సంబంధించిన రైతు పెసరు యాదగిరికి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో ఆ బావిని పూడ్చివేయకుండా రైతు అడ్డుకుంటున్నారని వెంటనే రైతుకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఆ బావిని కూడా వెంటనే పూడ్చి చేయాలని అన్నారు.నిడిగొండ గ్రామంలో సర్వేనెంబర్ 666 లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందని ఆక్రమణకు గురికాకుండా వెంటనే హద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ ప్రధానమైన ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో స్థానిక మండల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ పార్టీ మండల గ్రామ నాయకులు నామాల యాదగిరి వంగాల ఎల్లేష్ పెసరు యాదగిరి గోపగోని వెంకటేశ్వర్లు బండారు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.