
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలి
ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీసీ రాజకీయ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు
బుధవారం నాడు నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం శాఖ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ…
జనాభాలో 56% గా ఉన్న బీసీల కొరకు బిల్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని, ఇంకా ఎన్నాళ్ళు బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తారని, దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విషయం పట్ల ఆలోచన చేయాలని, ఎస్సీలకు మరియు ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
దేశ వ్యాపితంగా ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీసీలను విస్మరిస్తే పాలకవర్గాలు తగుమూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉన్నదని, బీసీలు ఐక్యం కావాలి అనే వారు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యాచరణకు సిద్ధం కావాలని రానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో బీసీ బిల్లు ప్రవేశ పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యావత్తు బీసీ కులాల వారు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు ఇనుగుర్తి వెంకటరమణాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు నిగిడాల వీరయ్య, బీసీ సంక్షేమ సంఘం కోదాడ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు మండవ నాగమణి బీసీ సంక్షేమ సంఘం నడిగూడెం మండల అధ్యక్షుడు యలగొండ నాగేశ్వరరావు బీసీ సంక్షేమ సంఘం గ్రామ కమిటీ నాయకులు సతీష్ తదితరులు ఉన్నారు.