
పిఎం శ్రీ, ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలి
కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని, ప్రీ ప్రైమరీ, పిఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, అంగన్వాడీలకు విద్యా బోధన బాధ్యతను అప్పగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ Ê హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ ఈరోజు (తేది: 2509
2025) తలపెట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది అంగన్వాడీ సిబ్బంది పట్ల ప్రదర్శించిన పోలీసుల జులుంను సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
నూతన విద్యా విధానం వల్ల రాష్ట్రంలో ఐసిడిఎస్ వ్యవస్థకు నష్టం కలగడమే కాకుండా దళిత, గిరిజన, బలహీన, మైనార్టీ తరగతులు పిల్లలను ప్రభుత్వ విద్యకు దూరం చేయడమేనని, మోడీ సర్కారు తెచ్చిన ఈ ప్రమాదకర బిల్లును రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయ పూనుకోవడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఐసిడిఎస్ పరిరక్షణలో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో యూనియన్ రాష్ట్ర కమిటీ ఈరోజు (తేది: 2509
2025)న తలపెట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రదర్శించిన నిర్భంధాన్ని ప్రతి ఒక్కరూ ఖండిరచాలని సిఐటియు కోరుతున్నది. విశాల ప్రయోజనాల కోసం సమరశీలంగా పోరాడుతున్న వేలాది మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను సిఐటియు అభినందిస్తున్నది.
రాష్ట్రంలో కార్మికుల సమస్యలను పరిష్కరించే దృష్టితో కాకుండా నిర్భంధంతో అణచివేసే చర్యలు కార్మికవర్గంలో అసంతృప్తి పెరుగుతుందని, జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని సిఐటియు హెచ్చరిస్తున్నది. ఇప్పటికైనా ప్రీ ప్రైమరీ, పిఎం శ్రీ విద్య పథకాన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు కోరుతున్నది.