పెంచిన వికలాంగుల పెన్షన్ అమలుకు వెంటనే జీవో విడుదల చేయాలి
Jangaonజనగామ పట్టణంలోని ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో ఎన్పిఆర్డీ జనగామ జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎన్పిఆర్డీ జిల్లా కమిటి సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిట్ల గణేష్ మాట్లాడుతూ జూన్ 9న మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వికలాంగుల పెన్షన్ మరో 1000 రూపాయలు పెంచుతున్నమని, పెంచిన పెన్షన్ తో కలిపి జూలై నెల నుండి రూ. 4016 అమలు చేస్తామని ప్రకటించారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో వికలాంగులు చాలా సంతోష పడినారు. ముఖ్యమంత్రికి పాలాభిషేకలు కూడా చేసినారని గుర్తు చేశారు. కానీ హామీ ఇచ్చి 45 రోజులు గడుస్తున్న అమలుకు మాత్రం నోచుకోలేదని విమర్శించారు. జూలై నెలలో ఇచ్చే పెన్షన్లకు పెరిగిన పెన్షన్ వర్తింప చేస్తామని ప్రకటించి, ఇప్పటి వరకు ఎందుకు జివో విడుదల చేయలేదని ప్రశ్నించారు. పెంచిన పెన్షన్ అమలుకు జివో విడుదల చేయకపోవడమంటే వికలాంగులను మోసం చేయడమే తప్ప మరొకటి కాదన్నారు. పెరిగిన పెన్షన్ కోసం వికలాంగులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కానీ ముఖ్యమంత్రికి మాత్రం వికలాంగుల గోస కన్పించడం లేదు. రాష్ట్రంలో ఇతర తరగతుల ప్రజలకు హామీలు ఇచ్చిన వెంటనే అమలుచేయడానికి జీవోలు జారీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెంచిన పెన్షన్ అమలుకు ఎందుకు జివో విడుదల చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే జివో విడుదల చేసి ముఖ్యమంత్రి వికలాంగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, లేనిఎడల రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం చేస్తామని, ఎన్పిఆర్డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ హెచ్చరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోట సురేందర్, జిల్లా కమిటీ సభ్యులు కొత్తపల్లి రమేష్, పిట్టల కుమార్, బండవరం శ్రీదేవి, మామిడాల రాజేశ్వరి, నామాల రాజు, ఇట్టబోయిన మధు, మోతె వెంకటమ్మ, ఎడ్ల రమాదేవి, ఆకారపు కుమార్, మాలోత్ రాజ్ కుమార్, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.