పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యం.
Jangaonవికలాంగుల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి !!
(ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్.)
స్త్రీ, శిశు సంక్షేమశాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమశాఖను రద్దుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగించాలని ఎన్పిఆర్డీ తోపాటు అనేక సంఘాలు, సంస్థలు చేసిన పోరాట ఫలితంగా వికలాంగుల సంక్షేమశాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పిఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతిస్తుందని, అలాగే వికలాంగులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోరాటాల ద్వారానే కోల్పోతున్న హక్కులను సాధించుకోవచ్చని మరొకసారి రుజువైందని, వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పిలుపునిచ్చారు.
దివి: 03-12-2022 శనివారం రోజున జనగామ పట్టణ కేంద్రంలోని జిల్లా ప్రజాసంఘాల కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమశాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారికి, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటుకు సహకరించిన వికలాంగ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి, అలాగే వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కే.వాసుదేవరెడ్డి గార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నామని చెబుతున్న వాటి ఫలాలు వికలాంగులకు పూర్తిస్థాయిలో అందడంలేదన్నారు. పథకాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం వల్ల ఆశించిన ప్రయోజనాలు సమకూరడంలేదని విమర్శించారు. విద్య, ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు ఉన్న అది సక్రమంగా అమలు కావడంలేదు. గత 5 సంవత్సరాలుగా వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీకి నోచుకోలేదని, సబ్సిడి ఋణాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1983 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గారు వికలాంగుల సమస్యల పరిష్కారం నిమిత్తం వికలాంగులకు ప్రత్యేక శాఖ ఉండాలని భావించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజనలో భాగంగా పరిపాలన సౌలభ్యం పేరిట రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ శాఖలను విలీనం చేసిందని తెలిపారు. అందులో భాగంగానే వికలాంగుల సంక్షేమ శాఖను స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా విలీనం చేయడం జరిగిందని విమర్శించారు. అనేక దశాబ్దాల కాలం పాటు ఉద్యమాలు చేసి సాధించిన వికలాంగుల సంక్షేమ శాఖను స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడం ద్వారా వికలాంగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్పిఆర్డీ దశలవారిగా ఉద్యమాలు నిర్వహించిందన్నారు. గత 6 సంవత్సరాలనుండి ప్రత్యేక శాఖ కోసం వికలాంగులు ఎదురుచూస్తున్న, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం ద్వారా వికలాంగులు ఉద్యమాలబాట పట్టారన్నారు. వికలాంగులు గత 6 సంవత్సరాలుగా సాగించిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఉద్యమాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖ కొనసాగించేందుకు 2022 డిసెంబర్ 02న జీ.వో నెంబర్ 33, 34 విడుదల చేసిందన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను వేరుచేస్తూ శుక్రవారం రోజున ప్రభుత్వం జీ.వో జారీచేయడం, దేనితో ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా వికలాంగుల్లో సంతోషాన్ని నింపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వికలాంగుల సంక్షేమ శాఖను డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబులిటీ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్ జెండర్స్ పర్సన్స్ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖగా మార్చబడిందన్నారు. ఒక వికలాంగుల శాఖ సాధన కోసం వికలాంగులు చేసిన ఉద్యమాల స్ఫూర్తితో రాబోయే కాలంలో వికలాంగులు ఆత్మగౌరం, హక్కుల సాధన, సంక్షేమం, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, సామాజిక, ఆర్ధిక, రాజకీయ రిజర్వేషన్లు, అలాగే ప్రత్యేక మంత్రిత్వ శాఖకై మరోసారి వికలాంగులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తోట సురేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మామిడాల రాజేశ్వరి, పిట్టల కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు బండవరం శ్రీదేవి, కొత్తపల్లి రమేష్, కోశాధికారులు ఇట్టబోయిన మధు, నామాల రాజు, జిల్లా కమిటీ సభ్యురాలు మతే వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.