ప్రైవేట్ కళాశాలల ప్రకటన హోర్డింగ్స్ తొలగించాలి
హనుమకొండ నగరంలో విచ్చలవిడిగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న ప్రకటన హోర్డింగ్స్‌ను వెంటనే తొలగించాలని స్వేరో విద్యార్థి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ కోరారు.ఈ మేరకు జిల్లా మధ్యంతర విద్యాధికారి గోపాల్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం కొత్త కొత్త పేర్లతో జూనియర్ కళాశాలలు ఏర్పడి ఆకర్షణీయమైన హోర్డింగ్స్ ద్వారా విద్యార్థులను మోసం చేస్తున్నారని విమర్శించారు.పేర్లు చూసి మోసపోయి ప్రవేశాలు పొందిన విద్యార్థులు చదువు సరిగా సాగకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వాలని అడిగితే పూర్తి ఫీజులు చెల్లించాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ తరహా మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని,విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.2024–25 విద్యా సంవత్సరం పూర్తికాక ముందే హోర్డింగ్స్ పెట్టి విద్యార్థులను మోసం చేయాలని చూస్తున్న యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో స్వేరో విద్యార్థి సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్వేరో విద్యార్థి సంఘం కాకతీయ ప్రభుత్వ కళాశాల అధ్యక్షులు చెట్టుపల్లి శివకుమార్,కాకతీయ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు సుశాంత్,కార్తీక్,సాయి,తేజ,చందు తదితరులు పాల్గొన్నారు.