బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో గాయపడిన దారంగుల పాణిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) బుధవారం పరామర్శించారు. విద్యుత్ షాక్కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే స్వయంగా అతని ఇంటికి వెళ్లి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బాధితుడితో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.దారంగుల పాణి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయాల్సిన సహాయాన్ని త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.ఇళ్ల మీదుగా వెళ్లే 11 కేవీ విద్యుత్ లైన్ ప్రమాదానికి కారణమవుతున్నదని గుర్తించిన ఎమ్మెల్యే, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే జీఎస్సార్ స్పష్టం చేశారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.