బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు
- శిలాఫలకాలను ధ్వంసం చేయాల్సిన అవసరం మాకు లేదు..
- బీఆర్ఎస్ నేతలు పూటకో మాట మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు..
- సుభాష్ కాలనీ, రాజీవ్ నగర్ కాలనీలల్లో పల్లె దవాఖానాల ప్రారంభోత్సవాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- భూపాలపల్లి బస్టాండ్ లో మేడారం బస్సు పాయింట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి మునిసిపాలిటీ అభివృద్ధిపై కొంతమంది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను భూపాలపల్లి ప్రజలు నమ్మొద్దని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మీకు గుండు సున్నా వేయడం ఖాయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎద్దేవా చేశారు.భూపాలపల్లి మున్సిపాలిటీ లోని సుభాష్ కాలనీ , రాజీవ్ నగర్ కాలనీ లల్లో ఎన్ హెచ్ ఎం నిధులు రూ.40 లక్షలతో కొత్తగా నిర్మించిన పల్లె దవాఖాలను ఈరోజు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఇతర నేతలు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….నేను(ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు) ఎమ్మెల్యేగా ఉన్న ఈ రెండున్నరేళ్ల కాలంలో చేసిన, చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మద్దతుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ఉద్దేశంతోనే నిరాధార ప్రచారాలు చేస్తున్నారన్నారు.భూపాలపల్లి నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు.ఈ అభివృద్ధిని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తుండటంతోనే, రాజకీయ లబ్ధి కోసం కొందరు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆధారాల్లేని ఆరోపణలను ప్రజలు నమ్మబోరని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని,భూపాలపల్లిని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.అబద్దాలను ప్రచారం చేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న మీకు భూపాలపల్లి మునిసిపాలిటీలోని 30 వార్డుల ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే అన్నారు.భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో మేడారం బస్సు పాయింట్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, డిపో .మేనేజర్ ఇందూ తో కలిసి జండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… భూపాలపల్లి డిపో నుండి మొత్తం 80 సర్వీసులు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు నడుపుతున్నట్లు తెలిపారు. మొత్తం నాలుగు పాయింట్లు భూపాలపల్లి నుండి 40 బస్సులు, సిరోంచ నుండి 20 బస్సులు, కాటారం నుండి 10 బస్సులు, కాళేశ్వరం నుండి 10 బస్సు సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు.జాతరకు వెళ్ళే భక్తులు ఆర్టీసీ సేవలు తప్పక సద్వినియోగం చేసుకోవాలన్నారు.పరకాల భూపాలపల్లి డిపోలు సంయుక్తంగా చిట్యాల, గణపురం , రేగొండలో బస్సు పాయింట్లు ఏర్పాటు చేస్తున్నాయని, మేడారం వెళ్లే భక్తులకు మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని భక్తులు అమ్మవార్లను దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.