బీసీ రిజర్వేషన్లసై 17న చలో రాజ్‌భవన్
తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేంద్రం వెంటనే 42 శాతం రిజర్వేషన్లు అమలు బిల్లును ఆమోదించాలని, పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని, 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న చలో గవర్నర్ కార్యక్రమానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, బీసీ వర్గాలకు, సామాజిక శక్తులకు, సంస్థలకు, వ్యక్తులకు పిలుపునిస్తున్నది.
రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ ఆమోదిస్తూనే కేంద్రంలో మాత్రం అడ్డుకుంటున్నది. ఆ పార్టీ నాయకులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్‌కు, రాష్ట్రపతికి పంపితే ఉద్దేశ్యపూర్వకంగానే ఎలాంటి ఉత్తర్వులు రాకుండా, బీసీలకు రిజర్వేషన్లు అమలుకాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నటున్నది. దీని ఫలితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వాయిదాపడ్డాయి. కాబట్టి ఈబిల్లుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా లీగల్‌గా సుప్రీంకోర్టులో పోరాడుతూనే, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వంపై పోరాడితేనే సమస్య పరిష్కారమవుతుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
ఈ నెల 18న జరిగే రాష్ట్రబంద్‌కు మద్ధతు ఇవ్వాలని బీసీ జేఏసీ నేతలు సీపీఐ(ఎం) ఆఫీసుకు వచ్చిన మెమోరాండం ఇచ్చి కోరారు. ఈ బంద్‌కు స్పష్టమైన డిమాండ్స్‌ను పెట్టాల్సిన అవసరముందని సీపీఐ(ఎం) భావిస్తున్నది. పార్లమెంట్లో బిల్లును, రాష్ట్రంలో ఆర్డినెన్స్‌ను ఆమోదించకుండా అడ్డుకుంటున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిస్తే జయప్రదానికి సంపూర్ణ మద్ధతునిస్తుందని తెలియజేశాం. అలా కాకుండా కేంద్ర బిజేపి ప్రభుత్వంపై పోరాటం చేయకుండా, ఈ కార్యక్రమం తీసుకుంటే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సీపీఐ(ఎం) పార్టీ స్వతంత్రంగానే పోరాటాన్ని కొనసాగిస్తుందని సీపీఐ(ఎం) తెలియజేస్తున్నది.