కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధికి కట్టుబడి ఉంది - ఎమ్మెల్యే మురళీ నాయక్ ఈ69న్యూస్ మహబూబాబాద్ అర్బన్,జూలై 17 తెలంగాణ రాష్ట్రంలో పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పేర్కొన్నారు.గురువారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 115 మంది లబ్ధిదారులకు రూ.36 లక్షల 65 వేల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని పనిచేస్తోందన్నారు.పార్టీకి అతీతంగా ప్రభుత్వ పథకాలు అందుతాయని వివరించారు.గత 18 నెలల పాలనలోనే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, బీఆర్ఎస్ హయాంలో కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే లాభం చేకూరిందని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన నిర్వహిస్తోందని పేర్కొన్నారు.ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, అత్యవసర వైద్య సేవల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతోందని, ఈ పథకం ప్రజలకు ఒక ఆశాకిరణంలా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, పట్టణ స్థాయి కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.