మహిళల అభివృద్ధియే తెలంగాణ ప్రగతి – సీఎం
మహిళల అభివృద్ధి లేకుండా రాష్ట్ర ప్రగతి సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆయన కార్యాలయం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.సీఎం మాట్లాడుతూ, తెలంగాణలో ఆడబిడ్డలకు సారె ఇవ్వడం సంప్రదాయం కాగా, అదే స్ఫూర్తితో ప్రతి మహిళకు ఉచితంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి నియమించి, మండల కేంద్రాల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు.మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం, యూనిఫారం కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పగించడం, ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభించడం వంటి చర్యలు మహిళల ఆర్థిక స్థిరత్వం కోసం తీసుకున్నామని తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే దిశగా అమెజాన్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుండి డిసెంబర్ 9 వరకు, పట్టణాల్లో మార్చి 1 నుండి 8 వరకు చీరల పంపిణీ జరుగుతుందని వివరించారు.ఈ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఇందిరా గాంధీ మహిళా శక్తికి ప్రతీక. ఆకాశం రంగును సూచించే నీలం రంగు చీరలు మహిళల అశేష సామర్థ్యానికిసంకేతం అని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేష్, డీఆర్డీవో శ్రీను, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ జోనా, డీపీవో లక్ష్మి రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్యల జిల్లా, మండల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.