Mallu Lakshmi Addresses All India AIDWA Conference – Key Highlights
పిల్లల్ని కనే యంత్రాలుగా పరిమితం చేస్తారా?
మనవాదంపై తెలంగాణ నుంచే యుద్ధం
-ఐద్వా బహిరంగసభలో మల్లు లక్ష్మి
- హైదరాబాద్
మనువాదులు మహిళల స్వేచ్ఛను పూర్తిగా హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి హెచ్చరించారు. మహిళలను పిల్లల్ని కనే యంత్రాలుగా పరిమితం చేయాలన్న సంఘ్ పరివార్ కుట్రలను పారనివ్వబోమని తేల్చిచెప్పారు. బండెనుక బండి కట్టి…పదహారు బండ్లు కట్టి…ఏ బండ్లె పోతవు కొడకో… నైజాం సర్కరోడా అంటూ నిజాం రాజ్యాన్ని కూల్చిన తెలంగాణ నుంచే మనువాదంపై యుద్ధం మొదలు పెడుతున్నామని ఆమె ప్రకటించారు. 4 వేల మంది అమరులై 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చోట జరిగే ఐద్వా జాతీయ మహాసభల నుంచి పోరాటానికి నాంది పలుకుతున్నామని తెలిపారు.
మహిళా సమస్యలను రాజకీయ ఎజెండాగా తీసుకురావడానికి ఐద్వా పోరాటాలతో పాటు ఐక్య పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిందని తెలిపారు. ఓటు హక్కు, సమాన హక్కు, ఆస్తి హక్కు, బాల్య వివాహాలపై నిషేధం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను సాధించిందని గుర్తుచేశారు. ఆ హక్కులను బీజేపీ కాలరాస్తోందని ఆమె విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలనీ, లేకపోతే పోరాటాలను ముమ్మరం చేస్తామని ఆమె హెచ్చరించారు. ధరలను తగ్గిస్తామనీ, ఏడాది 2 కోట్ల ఉద్యోగాలిస్తామని తదితర హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. పేదలకు ఇండ్లను ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై హింస పెరిగిందని మల్లు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందని గురజాడ అప్పారావు చెప్పినట్టు, అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభను చాటుతుంటే బీజేపీ వారిపై హింస జరిగితే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బిల్కిస్ బానో, ఉన్నావ్ తదితర లైంగిక దాడులను కేసులను లక్ష్మి ఉదహరించారు. మహిళలపై లైంగిక దాడుల సందర్భంగా బీజేపీ నిందితుల పక్షం వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకిచ్చిన హామీలు నెలకు రూ.2,500, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలు తదితర హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో శ్రామిక, అసంఘటిత మహిళలతో కలిసి ఐద్వా ఐక్య పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు.
పాలకుల నిర్లక్ష్యంతోనే మహిళల వెనుకబాటు
సమరశీల పోరాటాలు చేయాలి
-జూలకంటి రంగారెడ్డి
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన పాలకుల విధాలను, వారి నిర్లక్ష్యమే మహిళల వెనుకబాటుకు కారణమని మాజీ ఎమ్మెల్యే, ఐద్వా జాతీయ మహాసభల రిసెప్షన్ కమిటీ గౌరవాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. పురుషుల కన్నా ఎక్కువ శ్రమ చేస్తూ గుర్తింపు లేక, అసమాతలకు గురవుతున్న మహిళలు సమరశీల పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐద్వా జాతీయ మహాసభల్లో తీసుకునే నిర్ణయాల అమలు కోసం తెలంగాణలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని సూచించారు. మహిళా వ్యతిరేక ఆర్ఎస్ఎస్, బీజేపీని తరిమికొట్టడం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు సమాజంలో సగమున్న మహిళలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకిచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేసారు. వామపక్షాలు పోరాడితే కాంగ్రెస్ ప్రభుత్వాలు చట్టాలు చేశాయన్న సీఎం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. పేదలకు ఇండ్లు, అర్హులకు పెన్షన్ కోసం, ఇతర హక్కుల సాధన కోసం బలమైన పోరాటాలు చేయాలని ఆయన సూచించారు.
పోరాటాల వారసత్వాన్ని కొనసాగిస్తాం
-ఆర్.అరుణజ్యోతి
తెలంగాణ పోరాటాలకు పెట్టింది పేరను, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణజ్యోతి తెలిపారు. మహాసభల సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ మహిళలకు స్వాతంత్ర్యం వద్దంటున్న నేపథ్యంలో మహిళా హక్కులను కాపాడుకునేందుకు మహాసభల్లో తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తామనీ, ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకుంటామని ఆమె తెలిపారు.