
మహిళా హక్కుల ఉద్యమ కెరటం: మంద సంపత్
మహిళలకు విద్యా, హక్కులు కోసం పోరాటం చేసిన ఉద్యమ కేరటం సావిత్రిబాయ్ అని సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు, సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ అన్నారు. శుక్రవారం 31 వ డివిజన్ మహాత్మ జ్యోతిరావుపూలే నగర్ లో కంచర్ల కుమరస్వామి గారి అధ్యక్షతన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాల వేసి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంద సంపత్ గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి 1848 మే 12న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారన్నారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె అని అన్నారు. కేవలం 4 సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారన్నారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు, దళితుల, మహిళల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమేనన్నారు. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారన్నారు. అలాగే సత్య శోదక్ సమాజ్ ను ప్రారంభించి, బాల్యవివాహలకు వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహలను జరిపి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఆనాడు వచ్చిన ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేసి అదే వ్యాధి లో మరణించిన గొప్ప తల్లి అన్నారు. అలాంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి ఆశయసాధనకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నామన్నారు. దూడపాక రాజేందర్, చేరిపెళ్లై కుమరస్వామి, జెడా రమేష్, నేతగాని భారతి, పోట్లపెళ్లై రాజు, శివరాత్రి రాజక్క, ఓర్సు నవ్య, స్రవంతి, మని, శ్రవణ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.