
అటవీశాఖ అధికారుల దురుసు వైఖరిపై రైతుల ఆగ్రహం
ఈ69న్యూస్ ధర్మసాగర్/రిపోర్టర్ స్టీఫెన్(ప్రణయ్)
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో అటవీశాఖ అధికారుల వల్ల తీవ్రంగా బాధపడుతున్నామని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 842, 843, 844, 845, 846లలో తాము వారసత్వంగా పొందిన భూముల్లో అనేక సంవత్సరాలుగా సాగు చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా పాస్బుక్లు జారీ అయ్యాయని,రైతుబంధు,రుణమాఫీ పథకాల్లో తమకు లబ్ధి జరిగిందని వివరించారు.అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కూడా తమకు పాస్బుక్లు వచ్చాయని చెప్పారు.అదేవిధంగా,టెక్స్టైల్ పార్కు ఏర్పాటు కోసం జౌలిశాఖ అధికారులు సర్వే నిర్వహించి,కొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించి,నష్టపరిహారం కూడా అందుకున్నట్టు గుర్తుచేశారు.గతంలో అటవీ భూమి సరిహద్దుల్లో ఉన్నప్పుడు టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా,2018 నుంచి అటవీశాఖ అధికారులు తమపై అనవసర ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.తమ భూములు అటవీ భూములని చెబుతూ,వాటిని చదును చేస్తే కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు.జిపిఎస్ సాయంతో సర్వే చేసి కొత్తగా సరిహద్దులు గుర్తిస్తున్నారని, ఇది తాము ఎప్పటినుండో కల్పించుకున్న భూములను కబ్జా చేయడమేనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, తమ భూమిని తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు.