మైనారిటీల ఆర్థిక సహాయం ఐదు లక్షలకు పెంచాలి
Hyderabad, Jangaonమైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆర్థిక సహాయం ఇవ్వడం లేదని, మండలానికి ఒకరిద్దరకిచ్చి చేతులు దులుపుకొంటోందని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ విమర్శించారు, దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.ఆవాజ్ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ లో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి. జబ్బార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ లేక నామ్ కే వాస్తేగా మిగిలింది. ఇఫ్తార్ విందులు, రంజాన్ తోపాల పేరుతో మోసం చేస్తూ, అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపిందని అన్నారు. దళిత బందు తరహాలో మైనారిటీ బందు పథకం ఏర్పాటు చేసి 5లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తుంటే, లక్ష రూపాయల పథకం పెట్టడం, అదికూడా లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇస్తామని ప్రకటించి పేద మైనారిటీలకు అన్యాయం చేసిందని అన్నారు. మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ, దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆర్ధిక సహాయం అందించాలని, కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, ఆర్థిక సహాయం 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 6న కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, అబ్దుల్ లతీఫ్, అతిఖుర్ రెహమాన్, కోశాధికారి అబ్దుల్ సత్తార్, సహయ కార్యదర్శులు షేక్ ఇమామ్ పాషా, జహంగీర్, మహమ్మద్ అలీ, రాష్ట్ర కమిటీ సభ్యులు కలీముద్దీన్, బాబర్ ఖాన్, గులాం నశీర్, మహమ్మద్ సలీం, ఎం.ఏ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.