మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించిన ఎంపీ
కాజీపేటలో నిర్మాణంలో ఉన్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పరిశీలించారు.యూనిట్లో జరుగుతున్న నిర్మాణ పనులు,విభాగాల వారీగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె,కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 30 ఏళ్ల ప్రజా ఆశయానికి నెరవేరనున్న స్వప్నమని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి వల్లే ఈ యూనిట్ వాస్తవం అవుతోందన్నారు.భూములు కోల్పోయిన వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని,వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.స్థానికులకు యూనిట్లో వివిధ సేవల్లో ఉద్యోగాల అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.గతంలో ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రిని కలిసి భూ బాధితులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని వినతిపత్రం అందజేశానని ఎంపీ తెలిపారు.వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే అంశంపై ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు.రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మార్చి నెలలో ప్రారంభమవుతుందని,సంవత్సరానికి 600 కోచ్‌లను ఈ యూనిట్ తయారు చేస్తుందని ఎంపీ వివరించారు.పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో సిఎంకు ఆనంద్,జిజిఎం మురళీకృష్ణ,డిజిఎం శర్మతో పాటు ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు.