యువశక్తిని జాతీయస్థాయికి తీసుకెళ్లాలి
యువతలో దాగి ఉన్న అపారమైన ప్రతిభను వెలికితీసి, వారికి సరైన మార్గాన్ని చూపించేందుకు జిల్లా స్థాయి యువజనోత్సవాలు మరియు క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అభిప్రాయపడ్డారు.
మంగళవారం నాడు భూపాలపల్లి మంజూరునగర్లోని ఇల్లంద క్లబ్లో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వివేకానందుని ఆశయాలు
ముందుగా ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
క్రీడలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వేరువేరుగా ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడలు, యువజనాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. “యువత ఈ పోటీల్లో చురుగ్గా పాల్గొని, తమలోని ప్రతిభను అత్యుత్తమంగా ప్రదర్శించి,జిల్లా కీర్తిని ఢిల్లీ స్థాయికి (జాతీయస్థాయికి) తీసుకువెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగాలి,” అని వారు యువతకు పిలుపునిచ్చారు.
జాతీయ యువజనోత్సవం స్ఫూర్తితో యువత ఉన్నత శిఖరాలను అందుకోవాలని, ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రతిజ్ఞ
ఈ యువజనోత్సవాల్లో భాగంగా పలువురు యువతులు చేసిన కనువిందు చేసే జానపద నృత్యాలు ఆహూతులను, ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అనంతరం, యువతను పెడదోవ పట్టిస్తున్న మాదక ద్రవ్యాల నివారణ దానిపై అవగాహన పెంచేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించారు.
యువత ఈ ప్రతిజ్ఞ స్ఫూర్తిని కొనసాగించాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ జిల్లా నాయకులు కార్యకర్తలు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు