
ఈ69న్యూస్: హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం రామ్నగర్ గ్రామంలో విషాదం నెలకొంది.గ్రామానికి చెందిన బుర్ర సాంబరాజు (41) అనే గీతా కార్మికుడు మంగళవారం తాడిచెట్టు పై నుండి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయాడు.ఎప్పటిలాగే సాయంత్రం గీత కోసం తాడిచెట్టుపైకి ఎక్కిన సాంబరాజు మోకుజారి జారి కిందపడిపోయాడు.తలకు,శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.మృతుడికి భార్య సంధ్య,ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.గీత వృత్తి ద్వారానే కుటుంబాన్ని పోషిస్తున్న సాంబరాజు అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నది.భర్తను కోల్పోయిన సంధ్య కన్నీటి పర్యంతమవుతూ,పిల్లల భవిష్యత్తు ఏంటి అని విలపిస్తోంది.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.గ్రామ పెద్దలు,స్థానికులు సాంబరాజు కుటుంబానికి తక్షణం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలంటూ విజ్ఞప్తి చేశారు.నిరుపేద గీతా కార్మికుల జీవన భద్రతకు చర్యలు తీసుకోవాలని,వారి కుటుంబానికి సాయపడి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.