రేపాక గ్రామంలో సాధనాశూరుల ప్రదర్శన
తెలంగాణలోని అరుదైన ఆశ్రిత కళాకారుల్లో ఒకరైన సాధనశూరులు సోమవారం రేపాక గ్రామంలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఇంద్రజాల ప్రధానమైన కళారూపాలను ప్రదర్శించారు.ఉన్నది లేనట్టు,లేనిది ఉన్నట్టు చూపి కండ్లముందే కనికట్టు చేయడమే వీరి ప్రత్యేకత.రాళ్లను దేవతామూర్తులుగా మార్చి,అవే విగ్రహాలను పసుపు బియ్యంగా,పులిహోరగా మార్చేయడంతో పాటు కాగితాలను,దారాలను కాల్చి తిరిగి సృష్టించడం,రెండు చేతులతో కర్రసాము చేయడం,గుండెలపై రాళ్లు పెట్టుకొని సుత్తితో పగలగొట్టించుకోవడం,తలపై పొయ్యి పెట్టి పూరీలు చేసుకొని తినటం,మంటలో సలసలా కాల్చిన ఇనుప వస్తువులను చేతితో పట్టుకోవడం వంటి ప్రదర్శనలను ప్రజల ముందే చేసి చూపించారు.రెండు గంటల పాటు సాగిన ఈ ప్రదర్శనను ప్రజలంతా ఆసక్తిగా చూస్తూ అవాక్కయ్యారు.తమకు వారసత్వంగా సంక్రమించిన కళ,కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుతున్నామని, దీనికి తెలుగు ప్రజలంతా అండగా ఉండాలని సాధనాశూరుల పెద్ద మనుషులు గంజి కృష్ణ,గంజి శ్రీహరి,గంజి శ్రీనివాస్,గంజి చక్రపాణిలు,గంజి రంజిత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పద్మశాలి కుల పెద్ద మనుషులు పోరండ్ల రాజయ్య,వెల్దండి యాదగిరి,మాజీ కుల పెద్ద మనుషులు వెంగల కుమార స్వామి,పోరండ్ల సమ్మయ్య తో పాటు పద్మశాలి కులస్తులు,గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.