
చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
తెలుగు గళం న్యూస్, పరకాల, సెప్టెంబర్ 20
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్నంపెట్టే రైతన్నలను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన రైతు కళ్యాణపు రాజమొగిలి(రవి) యూరియా కోసం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనగా తీవ్రగాయాలపాలై హనుమకొండలోని ప్రయివేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న ఆయనను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా రవి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నడని విమర్శించారు.పులిగిల్ల గ్రామానికి చెందిన రైతులకు వరికోలు గ్రామంలో టోకెన్లు ఇవ్వడమేంటి..అక్కడ టోకెన్ తీసుకొని పరకాలలో సొసైటీలో యూరియా ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో యూరియా కోసం బయలుదేరిన రైతులను రోడ్డు ప్రమాదాలపాలై ప్రాణాలు కోల్పోతున్న మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు.బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంఘటలకు తావులేదన్నారు.రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచిన ఘనత కేసిఆర్ గారిదన్నారు.రైతులెవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి యూరియా తెచ్చుకుందామని అన్నారు.మీకు అండగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.రైతులను గోసపెడుతున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని అన్నారు.పరకాల ఆర్టీసీ డీఎం,అగ్రికల్చర్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ప్రమాదంలో కాలువిరిగిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.