
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కు వినతి పత్రం అందజేత
ఈ69న్యూస్ జనగామ
జనగామ జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలు,గాలి తుఫానుతో రైతులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొన్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి అన్నారు.నష్టపోయిన రైతులకు వరి పంటకు ఎకరానికి రూ.50,000,పళ్ళతోటలకు రూ.70,000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.యాసంగి పంటల సాగు కోసం రైతులు పెట్టుబడులు పెట్టినప్పటికీ,భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సుమారు 40 శాతం పంటలు ఎండిపోయాయని,మిగిలిన పంటలు చేతికి రానున్న సమయంలో వడగండ్ల వర్షాలతో నాశనమయ్యాయని తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం గురించి మాటలకే పరిమితమవుతున్నాయని,విపత్తుల సమయంలో వారికి సరైన మద్దతు ఇవ్వడంలో విఫలమవుతున్నాయని మండిపడ్డారు.వడగండ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతుకు,ఒక్క ఎకరానికీ అన్యాయం జరగకుండా పూర్తిస్థాయిలో పంటల అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.లేదంటే రైతులను సమీకరించి ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు.రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్ మాట్లాడుతూ,నష్టపోయిన రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని,ఖరీఫ్ సీజన్ కోసం ఉచితంగా ఎరువులు,విత్తనాలు అందించాలని,కౌలురైతులకు కూడా నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో గంగాపురం మహేందర్,తోటి దేవదానం,గురజాల లక్ష్మీనరసింహారెడ్డి,కళ్యాణం లింగం,పల్లెర్ర లలిత,మబ్బుపలయ్య తదితరులు పాల్గొన్నారు.