బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం, భార్యకు ఉద్యోగం ఇవ్వాలి – సీఐటీయూ డిమాండ్

ఈ69న్యూస్, జనగామ, జూలై 25:
జనగామ జిల్లా నర్మెట్ట మండలం మలకపేటకు చెందిన బానోతు రాజు అనే అన్మైండ్ కార్మికుడు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల గురువారం రాత్రి మరణించాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బానోతు రాజును సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ వేయాలంటూ తీసుకెళ్లి, స్థంభం ఎక్కించిన సమయంలో విద్యుత్ షాక్తో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనపై సంబంధిత అధికారులను ఇంకా అరెస్టు చేయకపోవడాన్ని సీఐటీయూ నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, పోలీసులు బాధిత కుటుంబాన్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
సీఐటీయూ ప్రధాన డిమాండ్లు:
బానోతు రాజు కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం
భార్య నీలకు విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం
బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వెంటనే సస్పెండ్ చేయాలి
ఈ ఘటనకు నిరసనగా జనగామ జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో యూనియన్ నాయకులు, మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ, “అన్మైండ్ కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. కానీ విద్యుత్ శాఖలో సురక్షిత చర్యలతోపాటు బాధ్యతల గురించి అధికారులకు పట్టడంలేదు. ఇది మానవత్వాన్ని తాకే విషయంగా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి” అని పేర్కొన్నారు.
అధికారులపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని రాపర్తి రాజు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కమలాకర్, లక్ష్మణ్, శ్రీను, వెంకటేష్, ప్రవీణ్, సంపత్, సోమన్న, భాస్కర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఆజ్మీరా సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసగొని సోమ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
“బానోతు రాజు కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు మేము అండగా ఉంటాం” అని వారు హామీ ఇచ్చారు.