
ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికుల బహిరంగ ధర్నా
న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు–సీఐటియు హెచ్చరిక
ఈ69న్యూస్ రఘునాథపల్లి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికుడు వేల్పుల నాగరాజు,వీధి లైట్లు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజుకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ముందుకు రావాలని,చికిత్స ఖర్చులు భరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు రాపర్తి రాజు డిమాండ్ చేశారు.
ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా
ఈ ఘటనను నిరసిస్తూ మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి భారీ ధర్నా నిర్వహించారు.కార్మికుల సంఘం నేతలు,కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పిస్తూ,స్పష్టమైన హామీ వచ్చేంతవరకు కార్యాలయాన్ని విడిచిపెట్టేది లేదని ప్రకటించారు.
మల్టీ పర్పస్ విధానం ప్రాణాల మీదకు తీసుకొస్తోంది
ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐటియు నేత రాపర్తి రాజు మాట్లాడుతూ..“బిఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన మల్టీ పర్పస్ వర్కర్ విధానం పంచాయతీ కార్మికుల ప్రాణాలకు ముప్పుగా మారింది.గ్రామీణ స్థాయిలో కార్మికులపై అసహనకర ఒత్తిడి ఉండటం,అనుభవం లేని పనుల్లోనూ దించటం వల్ల ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.ఇది బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం,”అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలి–సహించరాని నిర్లక్ష్యం
నాగరాజు కుటుంబం సామర్థ్యం దాటి అప్పులు చేసి చికిత్స అందిస్తున్నప్పటికీ,పూర్తిస్థాయి వైద్యం అందించలేని పరిస్థితిలో ఉన్నారు.అధికారుల వైఖరిని “కార్మికుడే బాధ్యత వహించాలి” అనే విధంగా తీసుకోవడం దారుణమని సీఐటియు ఖండించింది.“పర్మినెంట్ ఉద్యోగులకే వర్తిస్తాయంటూ,తాత్కాలిక కార్మికులను చిన్నచూపు చూస్తుండటం తగదు,”అని నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవు–సీఐటియు హెచ్చరిక
నాగరాజుకు న్యాయం జరిగే వరకు గ్రామపంచాయతీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీఐటియు నేతలు హెచ్చరించారు.మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని,ప్రమాద బీమా,ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విశాలంగా పాల్గొన్న పంచాయతీ సిబ్బంది
ఈ ధర్నాలో సీఐటియు మండల కన్వీనర్ పొదల నాగరాజు,యూనియన్ మండల అధ్యక్షుడు ఉమ్మగొని రాజేష్,జిల్లా అధ్యక్షుడు గంగాపురం మహేందర్,రాపోలు రాజ్‌కుమార్,బి.సత్యనారాయణ,కొయ్యడ బిక్షపతి,నల్లా రాజన్న,అజ్మత్,ప్రభాకర్,నీలం మధు,యాదలక్ష్మి,రేణుక తదితరులు పాల్గొన్నారు.