వైన్‌షాప్ ఏర్పాటు ఆపాలని కాలనీవాసుల విజ్ఞప్తి
జయశంకర్ భూపాలపల్లి పట్టణంలోని 18వ వార్డు ప్రజలు తమ గల్లీలో కొత్తగా ఏర్పాటవుతున్న వైన్‌షాప్‌ను నిలిపివేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.కాలనీవాసులు మాట్లాడుతూ — “మా గల్లి వెడల్పు కేవలం 10 అడుగులే. ఇంత సన్నని వీధిలో వైన్‌షాప్ ఏర్పాటు చేస్తే మహిళలు బయటకు రావడానికే ఇబ్బంది పడతారు. మేము షాపుకు వెళ్లాలన్నా, పిల్లలను పాఠశాలకు పంపాలన్నా అసౌకర్యంగా ఉంటుంది. మద్యం సేవించి రోడ్డుపై అసభ్య ప్రవర్తన చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల భద్రతకు ముప్పు ఏర్పడుతుంది” అని పేర్కొన్నారు.వారు గతంలో కూడా ఇలాంటి వైన్‌షాప్ ఏర్పాటు ప్రయత్నాన్ని ప్రజా ఉద్యమం ద్వారా ఆపిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రదేశంలో షాప్ ప్రారంభించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో రవి పటేల్ కాలనీవాసుల సమస్యలను విని, వెంటనే స్పందించారు. “ప్రజల శ్రేయస్సు మా పార్టీకి అత్యంత ప్రాధాన్యం. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ నిర్ణయాన్నీ మేము సహించము. మహిళల గౌరవం, భద్రత కోసం టిఆర్పి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.
తరువాత రవి పటేల్ స్థానిక ప్రజలతో కలిసి ఎక్సైజ్ శాఖ ఎస్ఐని కలుసుకుని వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వైన్‌షాప్ ఏర్పాటు తక్షణమే నిలిపివేయాలని, భవిష్యత్తులో ప్రజల అనుమతి లేకుండా ఇలాంటి అనుచిత నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు నివాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని,రవి పటేల్‌కు తమ మద్దతు తెలిపారు.