
199వ పూలే జయంతిలో రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ములుగు రోడ్డు లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి సురేఖ,ఎంపీ కడియం కావ్య,ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి,కేఆర్.నాగరాజు,కలెక్టర్లు ప్రావీణ్య డాక్టర్ సత్య శారద
ఈ69న్యూస్ వరంగల్
సమాజంలో అన్ని వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయులలో మహాత్మా జ్యోతిబా పూలే ఒకరని రాష్ట్ర పర్యావరణ,అటవీ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.శుక్రవారం హనుమకొండ జిల్లా ములుగు రోడ్డు జంక్షన్ లోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ,వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి,వరంగల్ పశ్చిమ,వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి కే ఆర్ నాగరాజు,కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి,హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య,డాక్టర్ సత్య శారద,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే,అదనపు కలెక్టర్ సంధ్యారాణి,తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..ఆనాటి సమాజంలోని రుగ్మతలను పారద్రోలడానికి ఉద్యమిస్తూ భవిష్యత్ తరాలకు మార్గం చూపిన మహనీయుల్లో జ్యోతిబాపూలే ఒకరని పేర్కొన్నారు.అంటరానితనాన్ని రూపుమాపేందుకు,విద్యా విషయంలో పూలే దంపతులు చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు.సమానత్వం కోసం వారు చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.మహిళలు విద్యావంతులు కావాలని చెప్పిన మొదటి వ్యక్తి జ్యోతిబా పూలే అని అన్నారు.జ్యోతిబాపూలే సతీమణి అయిన సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సేవలను అందించారని,పూలే దంపతులు ఆనాడే బాలికల కోసం విద్యాలయాన్ని స్థాపించి బాలికలు చదువుకోవాలని అవగాహన కల్పించారని గుర్తు చేశారు.సమాజానికి జ్యోతిబాపూలే అందించిన సేవలను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ లాంటి వారు ముందుకు సాగారని అన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేశారని,వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారని పేర్కొన్నారు.సమాజంలో అభివృద్ధి అనేక సంస్కరణలు తీసుకువచ్చి చరిత్రలో పూలే దంపతులు నిలిచారని తెలిపారు.సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను చేసిన మహనీయుల కృషి ఫలితంగానే మనం ఆ ఫలాలను పొందుతున్నామన్నారు.జనాభా దామాషా ప్రకారం బీసీలకు హక్కులు కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి అమలు చేస్తున్నామని అన్నారు.మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ,వరంగల్ ఆర్డీవోలు రాథోడ్ రమేష్,సత్యపాల్ రెడ్డి,హనుమకొండ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్ రెడ్డి,ఇతర అధికారులతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.