సమాజ పురోగతికి మహిళల పాత్ర ఎంతో కీలకమైంది
Andhra Pradesh, Krishnaసమాజంలో శాంతి ఏర్పాటులో మహిళల పాత్ర కీలకమైందని మహిళలు చైతన్యం పొందినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో నడుస్తుందని సమాజ పురోగతికి మహిళల పాత్ర ఎంతో కీలకమైందని అహ్మదీయ ముస్లిం జమాత్ మహిళల విభాగం జాతీయ ప్రతినిధి నైమా ఆరిఫ్ పేర్కొన్నారు.కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని
కుందేరు గ్రామంలో
అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం జమాత్ మహిళల విభాగం వార్షిక సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నైమా ఆరిఫ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.మహిళలు అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి చేరాలని,మహిళలు అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఆచరణ శిక్షణపై దృష్టి సారిస్తూ తమను తాము సంస్కరించుకుంటూ,పరస్పరం ప్రేమానురాగాలను పెంచుకుంటూ అభివృద్ధి కోసం నూతన లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని,అప్పుడే ఇలాంటి సమావేశాలు విజయవంతమవుతాయని అన్నారు.అనంతరం ఉమ్మడి జిల్లా మహిళా శాఖ అధ్యక్షురాలు ముహమ్మద్ ఖదీజా బేగం మాట్లాడుతూ..ఒకప్పుడు మహిళల పరిస్థితి చాలా దీనంగా ఉండేదని,స్త్రీని కేవలం ఒక వాడుక వస్తువు లాగా చూసేవారని అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మహమ్మద్ ప్రవక్త మహిళలకు సమాజంలో గౌరవం,సమాన హక్కులు కల్పించడమే గాక ఆస్తిలో సైతం హక్కుల్ని కల్పిస్తూ ఒక విశ్వాసి పరిపూర్ణ విశ్వాసిగా మారాలంటే మహిళలను గౌరవించాలని,ఆ విశ్వాసి స్వర్గాన్ని పొందాలంటే స్వర్గం తమ తల్లి పాదాల కింద ఉందని బోధించారని అన్నారు.సమాజ అభివృద్ధిలో సమాజ పురోగతికి మహిళల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు.మహిళలు 50 శాతం సంస్కరించబడితే ధార్మికంగా,ఆధ్యాత్మికంగా,సామాజికంగా కచ్చితంగా అభివృద్ధి చెందుతారని అన్నారు.జగత్ హజ్రత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణి హజ్రత్ ఆయేషా రజియల్లాహు అన్హా యొక్క ధార్మిక బోధనలను మహిళలు అనుసరించి ఆచరిచాలని కోరారు.ఈ సందర్భంగా మహిళలకు,బాలికలకు ధార్మిక విద్యా పోటీలు,వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి అనేక సంఖ్యలో మహిళలు,పిల్లలు,యువతులు పాల్గొన్నారు.