
telugu galam news e69news local news daily news today news
ఇష్టారీతిన మద్యం సిండికేట్ దందా చెడు మార్గంలో పయనిస్తున్న యువత లైసెన్స్ పొందినవి 5 ఉండగా 6వ షాపు ద్వారా సైతం విక్రయాలు..? 6వ షాపు నిర్వహణ సైతం అధికారుల కనుసన్నల్లోనే…? ఎక్సైజ్ శాఖ మౌనం వహించడంలో ఆంతర్యమేమిటో..? అధికారం అంతా సిండికేట్ దే..? – జనసేన చైతన్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రాయపూడి. ఏసు రత్నం. – ప్రజా పంథా నాయకులు మునిగాల శివ ప్రశాంత్. ఏజన్సీ ప్రాంతమైన భద్రాచలంలో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. ఈ ప్రాంతంలో మద్యం విచ్చల విడిగా విక్రయాలు జరుగుతున్నా సంబంధిత శాఖ చర్యలు తీసుకోకపోవడం విచారకరం. ప్రభుత్వ అనుమతి పొందిన 5 మద్యం షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరపాల్సి ఉండగా 6వ మద్యం షాపు సైతం ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతుండటం గమనార్హం. 5 మద్యం దుకాణాల వారు ఓ సిండికేట్‌గా ఏర్పడి మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. మద్యం విక్రయాలు విచ్చల విడిగా చేపడుతున్నా నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల సహకారంతోనే సిండికేట్ విచ్చల విడిగా మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సహకారంతోనే సిండికేట్ ముఠా మద్యం విక్రయాలు విచ్చల విడిగా చేపడుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు నియంత్రించకపోవడం, తనిఖీలు చేసి తగు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిండికేట్ వారు అందించే లక్షల రూపాయల ముడుపులు తీసుకుని భద్రాచలంలో జరుగుతున్న విచ్చల విడి మద్యం విక్రయాలను అరికట్టడం లేదని పలువురు ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సిండికేట్ ముఠా కనుసన్నల్లోనే బెల్టుషాపుల నిర్వహణ భద్రాచలంలో ప్రభుత్వ అనుమతి పొందిన మద్యం దుకాణాలు కేవలం 5 ఉండగా, బెల్టుషాపులు మాత్రం భద్రాచలం పట్టణంలో సుమారు 150 నుంచి 200ల వరకు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆయా బెల్టుషాపులకు సిండికేట్ ముఠా అండగా ఉంటూ మద్యాన్ని సరఫరా చేస్తుంది. మద్యం దుకాణాల్లో లభించని బ్రాండ్లు సైతం బెల్టుషాపులలో లభిస్తున్నాయంటే, బెల్టుషాపులు నిర్వహకులకు సిండికేటముఠా ఏ విధంగా సహకరిస్తుందో చెప్పవచ్చు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పి ధరలకు విక్రయించే మద్యాన్ని బెల్టుషాపుల నిర్వహకులకు మాత్రం క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.30ల వరకు అధికంగా వసూళ్ళు చేస్తూ కోట్ల రూపాయలను అక్రమ పద్ధతిలో సంపాదిస్తున్నారు. ఇదంతా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసే జరుగుతుందని, వారికి అందాల్సిన ముడుపులను వారికి ఇస్తే. ఇటువైపు చూడరనే విమర్శలు వినిపిస్తున్నాయి. మా మామూళ్ళు మాకివ్వండి. మీ వ్యాపారం మీరు చేసుకోండి. అంటూ తెరచాటు ఒప్పందాలు చేసుకున్న ఎక్సైజ్ శాఖ సిండికేట్ వ్యాపారులు మందుబాబులను ఎంత మేర దోచుకున్నా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదని మద్యం ప్రియులు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గుడి, బడి తేడా లేకుండా మద్యం విక్రయాలు బెల్టుషాపుల ద్వారా చేపడుతున్నా సంబంధి అధికారులు బెల్టుషాపులను నియంత్రించకపోవడం విచారకరం. కొన్ని ప్రాంతాల్లో మహిళలు, బాలికలు బెల్టుషాపులు ఏర్పాటు చేసిన ప్రాంతం మీదుగా వెళ్ళాలంటేనే భయాందోళన చెందే పరిస్థితి నెలకొంది. చెడుమార్గం వైపు పయనిస్తున్న యువత. ఎక్కడ చూసినా మద్యం విక్రయాలు అధికంగా జరుగుతుండటంతో యువత సైతం చెడుమార్గంలో పయనిస్తుంది. మద్యం దుకాణాలతో పాటు ఒక్కో వీధిలో సుమారు 5 నుంచి 10 వరకు బెల్టుషాపులు ఉండుటంతో మద్యం సేవించి రహదారులపై ఘర్షణలు పడుతున్న సంఘటనలు అనేకం. యువత బంగారు భవిష్యత్‌ను నాశనమవుతున్నా కన్న తల్లిదండ్రులు మందలించే పరిస్థితి లేదు. మద్యం సేవించవద్దని మందలిస్తే…మద్యం సేవించిన మత్తులో తమపై దాడి చేస్తారేమోననే విధంగా నేడు యువత పరిస్థితి నెలకొంది. అదే విధంగా మత్తుకు బానిస అవుతున్న యువత చిన్న వయస్సులోనే అనేక వ్యాధుల బారిన పడి మృత్యువుబారిన పడుతున్నారు. ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డ సంఘటనలు అనేకం. ఇకనైనా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు ఏజన్సీ ప్రాంతమైన భద్రాచలంలో ‘సీతారాముల సాక్షిగా జరుగుతున్న మద్యం అక్రమ వ్యాపారాన్ని నియంత్రించాలి. సిండికేట్ అండదండలతో నిర్వహిస్తున్న బెల్టుషాపులను కట్టడి చేయాని పక్షణ ఈ ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాల నాయకులను,మహిళా సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం అని హెచ్చరించారు.