సీపీఐ పార్టీకి వందేళ్లు-గ్రామాల్లో ఎర్రజెండా ఆవిష్కరణ
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భావానికి వందేళ్లు పూర్తైన సందర్భంగా జఫర్గఢ్ మండలంలోని పలు గ్రామాల్లో సీపీఐ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించామని పార్టీ నియోజకవర్గ కార్యదర్శి,మండల కార్యదర్శి జువారి రమేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పేద-బడుగు-బలహీన వర్గాల హక్కుల కోసం 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడిందని గుర్తు చేశారు.బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్ర్యం,స్వేచ్ఛ,సమానత్వం కోసం సీపీఐ అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు.స్వాతంత్ర్య ఉద్యమంలో అనేక మంది సీపీఐ నాయకులు,కార్యకర్తలు తమ ప్రాణాలను అర్పించారని ఆయన పేర్కొన్నారు.శ్రామిక వర్గాలను సంఘటితం చేసి మహోజ్వల పోరాటాలకు నాయకత్వం వహించడంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు.భూసంస్కరణల చట్టం,భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ,“కూడు-గుడ్డ-నీడ”నినాదంతో పేదలకు పట్టాలు ఇప్పించడంలో కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాడిందని వివరించారు.ప్రజలందరికీ విద్య,వైద్యం ప్రభుత్వమే అందించాలనే లక్ష్యంతో పాటు శాశ్వత నివాసాలు,ఉపాధి హక్కు,అటవీ హక్కులు,గిరిజన హక్కులు,సమాచార హక్కు చట్టం వంటి అనేక ప్రజాహిత చట్టాల సాధనలో సీపీఐ పాత్ర అనన్యసాధారణమని తెలిపారు.కుల,మత వివక్షలు,అంటరానితనం,మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నిరంతరం పోరాడారని అన్నారు.కమ్యూనిస్టుల త్యాగాల ఫలితంగానే ఆహార భద్రత చట్టం,అటవీ హక్కుల చట్టం వంటి కీలక చట్టాలు దేశంలో అమలులోకి వచ్చాయని చెప్పారు.అయితే నేటి బీజేపీ ప్రభుత్వం ప్రజా హక్కులను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా చట్టాలు చేస్తోందని విమర్శించారు.పేదలను మరింత పేదలుగా మార్చే విధానాలను వ్యతిరేకిస్తూ,అమరులైన కమ్యూనిస్టు నాయకుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎర్రజెండాను మరింత బలంగా కొనసాగిస్తామని జువారి రమేష్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు,రైతు సంఘం మండల అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా,మండల పార్టీ సహాయ కార్యదర్శి పెండ్యాల సమ్మయ్య,సీనియర్ నాయకులు కూరపాటి చంద్రమౌళి,అన్నెపు అజయ్,మంద బుచ్చయ్య,ఎర్రం సతీష్,గడ్డి రాజు,బుల్లె సాయులు,ఎండీ రజియా బేగం,ఎండీ నురున్నిసా,ఎండీ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.