సూర్యపేటలో గీతన్న రణభేరి సభ
తెలంగాణ రాష్ట్రంలో కల్లు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని,కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సూర్యపేట పట్టణంలో జరిగే“గీతన్న రణభేరి”బహిరంగ సభను విజయవంతం చేయాలని గౌడ,కల్లుగీత కార్మికులు పెద్దఎత్తున హాజరుకావాలని జనగామ జిల్లా అధ్యక్షుడు బూడిద గోపి పిలుపునిచ్చారు.జిల్లా కార్యదర్శి బాల్నే వెంకటమల్లయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన,నవంబర్ 28,29,30 తేదీల్లో సూర్యపేటలో జరిగే రాష్ట్ర నాల్గవ మహాసభలను ఘనవిజయం చేయాలని కోరారు.కల్లు గీత వృత్తి రోజురోజుకీ క్షీణిస్తోందని,సేఫ్టీ కిట్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.చెట్ల నుండి పడి గాయపడిన బాధితుల ఎక్స్‌గ్రేషియో గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉండటం దురదృష్టకరమని,దీనికి కావాల్సిన కేవలం 13 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని విమర్శించారు.ఎన్నికలకు ముందు గీత కార్మికుల పెన్షన్‌ను 4 వేల రూపాయలకు పెంచుతామని,ఎక్స్‌గ్రేషియోను 5 లక్షల నుండి10 లక్షలకు పెంచుతామని,రాష్ట్రవ్యాప్తంగా బెల్టు షాపులను తొలగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను గుర్తుచేశారు.జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చుతామని మొదటి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం పాపన్నయుడికి అవమానమని వ్యాఖ్యానించారు.వెంటనే జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం 5 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని,గీత కార్పొరేషన్ నిధులను పెంచి పెండింగ్‌లో ఉన్న సహాయాలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య,జిల్లా ఉపాధ్యక్షులు కంకటి రాజయ్య,జొన్నగోని శ్రీనివాస్,ఫరీదుల భాస్కర్,బండపల్లి శంకరయ్య,సహాయ కార్యదర్శులు బాల్నే ఉమాపతి,కుర్ర రాజు,బస్వాగాని మహేందర్,బైరగోని బలరాం,కమిటీ సభ్యులు యాదండ్ల పరంధాములు,గోపగోని యాదగిరి,బైరగోని వెంకటయ్య,వడ్లకొండ వెంకటేష్,బాల్నే కార్తీక్,మూల కిరణ్,గొల్లపల్లి మురళి,పనస శ్రీనివాస్,ముసిగుంపుల సమ్మయ్య,సోషల్ మీడియా నాయకులు మూల వైకుంఠం,పోతుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.